కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ (DK Shiva kumar) కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ (shiva raj kumar) ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున రాష్ట్రంలోని ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని కోరారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని, పోటీ చేయాలని కన్నడ సినీ నటుడు శివ రాజ్ కుమార్ కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆఫర్ ఇచ్చారు. ఆదివారం కర్ణాటక లోని బెంగళూరులో 'ఈడిగ' కమ్యూనిటీ కన్వెన్షన్ జరిగింది. దీనికి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేఎస్, ఈడిగ సామాజిక వర్గానికి చెందిన శివ రాజ్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేధికపై శివ కుమార్ మాట్లాడారు. లోక్ సభలో ప్రవేశించడానికి ఇది గొప్ప అవకాశమని, కర్ణాటకలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని తాను శివరాజ్ కుమార్ ను కోరినట్లు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారని తనతో చెప్పారని అన్నారు. అయితే సినిమాలు ఎప్పుడైనా చేసుకోవచ్చని, కానీ పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదని అన్నారు.
DK Shivakumar Offers Lok Sabha Ticket To Shiva Rajkumar: ಶಿವಣ್ಣ ಮುಂದೆ ಸಂಸದರಾಗ್ತಾರಾ? ಎಂಥಾ ಆಫರ್ ಕೊಟ್ರು ನೋಡಿ ಡಿಕೆಶಿ! https://t.co/v20xO4P7Fg
— Karnataka_Tak (@Karnataka_Tak)
కాగా.. శివ కుమార్ ఇచ్చిన ఆఫర్ ను శి వ రాజ్ కుమార్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. తన భార్యకు టిక్కెట్ ఇచ్చే విషయం ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీని కోరినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కన్నడ సూపర్ స్టార్ కు కాంగ్రెస్ పార్టీతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన బావమరిది మధు బంగారప్ప కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివ రాజ్ కుమార్ కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూడా త్వరలోనే పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా.. కర్ణాటకలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో అదే ఉత్సాహంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 20 స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు కూడా అయిన డీకే శివకుమార్ ఈ బాధ్యతలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.