
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ కేసులు కూడా ఇక్కడ అధికంగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు 125కి చేరుకున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. కరోనా నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. అందులో భాగంగానే ఈరోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైద్య శాఖ అధికారులతో, ఇతర ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఢిల్లీ ప్రభుత్వం ఒమిక్రాన్ కేసులను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. రోజుకు లక్ష కేసులు నమోదైనా దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు. గత కొన్ని నెలలుగా ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే కొత్తగా సిబ్బందిని నియమించుకున్నామని తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకులు వంటి అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. పండుగల సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
రోజుకు 3 లక్షల టెస్ట్‌లు చేసే సామర్థ్యం..
ఢిల్లీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కొవడానికి ముందస్తుగా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతీ రోజు మూడు లక్షల కరోనా టెస్ట్‌లు నిర్వహించే సామర్థ్యం ఢిల్లీకి ఉందని అన్నారు. కరోనాను నయం చేయడానికి అవసరమైన మందులను కూడా నిల్వ చేసుకొని ఉన్నామని చెప్పారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండే లక్ష మందికి పైగా అవసరమైన కిట్లు సమకూర్చుకొని ఉన్నామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను పటిష్టం చేస్తోందని అన్నారు. కరోనా సోకి తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని, హస్పిటల్‌కు రావొద్దని ఆయన కోరారు. తమ హోమ్ ఐసోలేషన్ అందించే విధానం కింద తమ ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో ఉన్న కరోనా రోగులను సందర్శిస్తారని తెలిపారు. టెలి-కౌన్సెలింగ్ ద్వారా వైద్యం అందిస్తారని అన్నారు. కరోనా నిర్ధారణ అయిన వెంటనే హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని, తమ ఆరోగ్య సిబ్బందే అక్కడికి వచ్చి ఆక్సిమీటర్ తో కూడిన కిట్ ను అందిస్తారని చెప్పారు. రాబోయే 3 వారాల్లో 15 ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ ప్రభుత్వానికి చేరుతాయని తెలిపారు.
న్యూస్‌పేపర్ హాకర్లకు రూ. 6 వేల కోవిడ్ ఆర్థిక సాయం.. ప్రకటించిన ఒడిశా సీఎం
ఆందోళనలు అవసరం లేదు..
కోవిడ్ -19 సోకిన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులందరికి ప్రభుత్వ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుందని అన్నారు. వారి ఎప్పటిప్పుడు పర్యవేక్షణ జరుపుతూ అవసరమైన సహాయాలన్నీ అందిస్తారని చెప్పారు. పూర్తి చికిత్స ప్రభుత్వమే అందిస్తుందని హామీ ఇచ్చారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు 10 రోజుల పాటు వైద్యులు కౌన్సెలింగ్ ఇస్తారని చెప్పారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని, ఎవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు.
ఢిల్లీలో ఓమిక్రాన్ కేసులు 125కి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా క్రిస్ట్‌మస్, న్యూయర్ వేడుకలపై నిషేదం విధించింది. బహిరంగ సమావేశాలు, సభలు నిర్వహించుకోవడానికి అనుమతి లేదని చెప్పింది. ప్రజలు తప్పకుండా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ వేసుకోవాలని తెలిపింది.