ఇక సెలవు.. అధికారిక లాంఛనాలతో ముగిసిన వాణీ జయరాం అంత్యక్రియలు

By Siva KodatiFirst Published Feb 5, 2023, 7:36 PM IST
Highlights

దిగ్గజ నేపథ్య గాయనీ వాణీ జయరాం అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్ర అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. అయితే ఆమె ఎలా చనిపోయిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. వాణీ జయరాం మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

దిగ్గజ నేపథ్య గాయనీ వాణీ జయరాం అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్ర అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. అనంతరం పోలీసులు వాణీ జయరాం భౌతికకాయం వద్ద గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. 

మరోవైపు.. వాణి జయరాం మృతిని పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఆమె శనివారం ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో తన ఇంట్లో గాయాలతో పడి ఉన్న విషయం తెలిసిందే. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఇది గమనించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే ఆమె ఎలా చనిపోయిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. థౌజండ్‌ లైట్స్‌ పోలీస్‌ స్టేషన్‌కి చెందిన పోలీసులు వాణి మరణంపై ఐపీసీ సెక్షన్‌ 174కింద కేసు నమోదు చేశారు.

అందులో భాగంగా ఇప్పటికే ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. గత నెల(జనవరి) 26 నుంచి వాణి ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్టు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్‌ నిపుణులు ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్నారు. చివరగా వాణీ ఎవరితో మాట్లాడారు, ఎవరెవరు వచ్చిపోయారు అనేది ఆరా తీస్తున్నారు. మరోవైపు వాణీ జయరాం మరణించినా, ఆమె తరపున బంధువులు ఎవరూ ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడం కూడా పలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది.

ALso REad: బ్రేకింగ్ : ప్రముఖ గాయని వాణీ జయరామ్ కన్నుమూత

1945 నవంబర్ 30వ తేదీన తమిళనాడులోని వేలూరులో జన్మించిన వాణీ జయరామ్ దాదాపు 5 దశాబ్దాలు సంగీత ప్రియులని తన గాత్రంతో అలరించారు. ఆమె అసలు పేరు కలైవాణి. 8 ఏళ్ళ చిన్నవయసులోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతూ వాణీ జయరామ్ తన ప్రతిభ చాటుకున్నారు. తెలిమంచు కరిగింది.. ఎన్నెన్నో జన్మల బంధం.. ఒక బృందావనం లాంటి సూపర్ హిట్ సాంగ్ ఆమె గాత్రం నుంచి జాలువారినవే. అన్ని భాషల్లో కలిపి ఆమె 14 వేల పాటలు పాడారు. కెవి మహదేవన్, ఇళయరాజా, ఎమ్మెస్ విశ్వనాథ్ , చక్రవర్తి లాంటి ప్రముఖ సంగీత దర్శకులు వాణీ జయరామ్ తో పాటలు పాడించారు. ఇటీవలే రిపబ్లిక్ డే సందర్భంగా వాణీ జయరామ్ కి కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. కానీ ఇంతలోనే ఆమె మరణించడం తీరని విషాదం అనే చెప్పాలి. 

వివాహం తర్వాత తన భర్త ప్రోత్సాహంతో గాయనిగా మరింత ఎదిగారు. 1975లో వాణీ జయరామ్ తొలిసారి తమిళ చిత్రం అపూర్వ రాగంగళ్ లో పాడిన పాటలకి గాను ఆమె జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రంలో పలు పాటలు పాడి మరోసారి జాతీయ అవార్డు కైవసం చేసుకున్నారు. 1991లో స్వాతికిరణం చిత్రానికి మూడవసారి ఆమెకి నేషనల్ అవార్డు దక్కింది. శంకరాభరణం చిత్రాన్ని తెరకెక్కించిన ది గ్రేట్ కె విశ్వనాథ్ మరణించిన మరుసటి రోజే వాణీ జయరామ్ మరణించడం జీర్ణించుకోలేని అంశం. 

వాణీ జయరామ్ భర్త పేరు జయరామ్. ఈ దంపతులకు పిల్లలు లేరు. శంకరాభరణంతో పాటు ఆమె శృతి లయలు, స్వర్ణకమలం లాంటి విశ్వనాధ్ చిత్రాలకు కూడా ఆమె పాటలు పాడారు. ఆమె మరణంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె మృతి గురించి పోస్ట్ లు చేస్తున్నారు.

click me!