
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో (Lakhimpur Kheri) చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి విచారణ తీరుపై సుప్రీం కోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి కొందరు సాక్ష్యలను విచారించం అని తెలుపడం తప్ప.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమకు సమర్పించిన స్థాయి నివేదికలో ఏమి లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం లఖింపూర్ ఘటనపై విచారణ చేపట్టింది. వీడియో సాక్ష్యాలకు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక అందించడంలో ఆలస్యాన్ని ప్రశ్నించింది. నిందితుల ఫోన్ కాల్ వివరాలు ఇవ్వాలని, పోలీసులు సేకరించిన ఆధారాలు కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
కేసు విచారణ తాము ఆశించినట్టుగా జరగడం లేదని వ్యాఖ్యానించింది. విచారణను సీబీఐకి బదిలీ చేసేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ పర్యవేక్షణకు ప్రతిపాదించింది. ఇందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్ కుమార్ జైన్, జస్టిస్ రంజిత్ సింగ్‌ల పేర్లను సూచించింది. చార్జిషీట్లు దాఖలు చేసే వరకు విచారణను మాజీ న్యామమూర్తులు పర్యవేక్షించనివ్వాలని ధర్మాసనం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన న్యాయ కమిషన్‌ను కొనసాగించడం తమకు ఇష్టం లేదని పేర్కొంది. కేసు తదుపరి విచారణను నవంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది.
Also read: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వాహనంపై గుడ్లతో దాడిచేసిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు
Lakhimpur Kheriలో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి Ajay Mishra కుమారుడు అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనకు కారణమైన అశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
రైతులను ఢీ కొట్టిన ఎస్‌యూవీ డ్రైవింగ్ సీటులో మంత్రి కొడుకు ఉన్నాడని మృతుల కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఆ తర్వాత 12 గంటల పాటు అశిష్ మిశ్రాను ప్రశ్నించిన పోలీసులు.. అక్టోబర్ 9న అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.