Lakhimpur Violence: పక్కా ప్రణాళికతో‌నే లఖింపూర్ ఖేరీ ఘటన.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్న సిట్

Published : Dec 14, 2021, 12:06 PM IST
Lakhimpur Violence: పక్కా ప్రణాళికతో‌నే లఖింపూర్ ఖేరీ ఘటన.. ఉద్దేశపూర్వకంగా చేసిందేనన్న సిట్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో నిందితులుగా ఉన్న 13 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307తో (attempt to murder) సహా కొత్త సెక్షన్‌లను జోడించాలని ఆ ప్రాంత చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు సిట్ దరఖాస్తు దాఖలు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో (Lakhimpur Kheri) అక్టోబర్ 3వ తేదీన చోటుచేసుకున్న హింస దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక విషయాలను వెల్లడించింది. ఈ కేసులో 13 మంది నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307తో (attempt to murder) సహా కొత్త సెక్షన్‌లను జోడించాలని ఆ ప్రాంత చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు దరఖాస్తును దాఖలు చేసింది.

సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న విద్యారామ్ దివాకర్ ఈ దరఖాస్తును డిసెంబర్ 9వ తేదీన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు దాఖలు చేశారు. నిందితులపై ఉన్న ఐపీసీలోని 279, 338, 304A సెక్షన్‌ల స్థానంలో కొత్త సెక్షన్లను వారెంట్‌లో చేర్చేందుకు అనుమతించాలని  కోరారు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో, ఉద్దేశపూర్వకంగా జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తెలిపారు. 

ప్రస్తుతం నిందితులపై ఉన్న భారతీయ శిక్షాస్మృతిలోని 279 (ర్యాష్ డ్రైవింగ్), 338( ఆవేశంగా గానీ, నిర్లక్ష్యంగా గానీ ఏదైనా చర్య ద్వారా తీవ్రంగా గాయపర్చడం), 304ఏ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం) సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే వాటి స్థానంలో.. 307 (హత్యయత్నం), 326 (ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్చందంగా తీవ్రంగా గాయపరచడం), 34 (అనేక మంది ఉమ్మడి ఉద్దేశంతో ప్రణాళిక పరంగా చర్యలకు పాల్పడటం) సెక్షన్లను చేర్చాలని సిట్ కోరింది.

Lakhimpur Kheri‌లో అక్టోబర్ 3వ తేదీన మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్ ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి  Ajay Mishra కుమారుడు  అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయినవారిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, లువ్‌కుష్, ఆశిష్ పాండే, శేఖర్ భారతి, అంకిత్ దాస్, లతీఫ్, శిశుపాల్, నందన్ సింగ్, సత్యం త్రిపాఠి, సుమిత్ జైస్వాల్, ధర్మేంద్ర బంజారా, రింకు రాణా, ఉల్లాస్ త్రివేది ఉన్నారు. వారిని లఖింపూర్ ఖేరీ జిల్లా జైలులో ఉంచారు. 

ఇక, డిసెంబర్ 10వ తేదీన..ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రా బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వినోద్ షాహి.. దర్యాప్తు తీరును కోర్టుకు వివరించారు. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు