
ప్రభుత్వ ఆస్ప్రతి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్క పీక్కుతింది (Dog eats body). మార్చురీలో ప్రవేశించిన కుక్కు ఈ పనిచేసింది. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన ఒడిశాలోని రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రిలో (Rourkela Government Hospital) ఆదివారం రోజున చోటుచేసుకుంది. వివరాలు.. గోపబంధుపల్లికి చెందిన రాజేష్ యాదవ్ (40) గురువారం మల్గోడం ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని మృతదేహాన్ని ఉదిత్‌నగర్ పోలీసులు (Uditnagar police) ఆర్‌జిహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచారు.
అయితే రాజేష్ బంధువులు మృతదేహాన్ని తీసుకోవడానికి వచ్చినప్పుడు.. కుక్క పాక్షికంగా మృతదేహాన్ని తినేసినట్టుగా గుర్తించారు. దీంతో వారు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి రాజేష్ కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిని ముట్టడించి ఆరు గంటల పాటు నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న రూర్కెలా తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చంద్రకాంత్ మల్లిక్ (Chandrakant Mallick) అక్కడి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చంద్రకాంత్ మల్లిక్ హామీ ఇవ్వడంతో రాజేష్ కుటుంబ సభ్యులు నిరసనను విరమించారు. మరోవైపు ఆస్పత్రి యజమాన్యం కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.
రాజేష్ యాదవ్ మేనల్లుడు సోనూ యాదవ్ మాట్లాడుతూ.. ‘శుక్రవారం ఉదయం రాజేష్ మృతిచెందిన విషయం తెలిసింది. ప్రమాదానికి కారణమైన వాహనంపై చర్యలు పెండింగ్‌లో ఉన్నందును మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే ఆదివారం తెల్లవారుజమున మృతదేహం తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు.. మృతదేహం ముఖాన్ని కుక్క పాక్షికంగా తినట్టుగా కనిపించింది. కొందరు మార్చరీ నుంచి వీధి కుక్క బయటకు వచ్చినట్టుగా చూశారు’ అని తెలిపారు. ఈ ఘటనకు ఆర్‌జీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని సోనూ యాదవ్ ఆరోపించారు. మరణించిన వ్యక్తి పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధకరమని పేర్కొన్నారు. మార్చురీ బాధ్యతలు చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆర్‌జీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీశ్ బారిక్ మాట్లాడుతూ.. ‘మార్చురీలోకి ప్రవేశించిన ఒక కుక్క మరణించిన వ్యక్తి ముఖాన్ని ఛిద్రం చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలితే చర్యలు తీసుకుంటాం. భవిష్యతుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. 2017 నుంచి మార్చురీ నిర్వహణ కొనసాగుతుందని.. కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి’ అని చెప్పారు.