పెదవులపై ముద్దు పెట్టడం అసహజ లైంగిక నేరం కాదు: బాంబే హైకోర్టు

By Sumanth KanukulaFirst Published May 15, 2022, 3:55 PM IST
Highlights

పెదవులపై ముద్దు పెట్టడం, ప్రేమతో తాకడం అసహజ నేరాలు కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా జస్టిస్ అనుజ ప్రభుదేశాయ్ ఈ  వ్యాఖ్యలు చేశారు.

పెదవులపై ముద్దు పెట్టడం, ప్రేమతో తాకడం అసహజ నేరాలు కాదని బాంబే హైకోర్టు పేర్కొంది. మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా జస్టిస్ అనుజ ప్రభుదేశాయ్ ఈ  వ్యాఖ్యలు చేశారు. ఈ నేరాలు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 పరిధిలోకి రాబోవని పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేసిన నిందితుడిని.. 14 ఏళ్ల బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు గతేడాదిఅరెస్ట్ చేశారు. 

ఎఫ్ఐఆర్ ప్రకారం.. బాలుడి తండ్రి తన అల్మారాలో డబ్బు కనిపించకుండా పోయింది. నిందితుడికి డబ్బు ఇచ్చినట్లు బాలుడు చెప్పాడు. ఆన్‌లైన్ గేమ్ 'ఓలా పార్టీ' కోసం రీఛార్జ్ చేయడానికి తాను ముంబైలోని శివారు ప్రాంతంలో నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని బాలుడు తన తండ్రితో చెప్పాడు. ఓ రోజు రీచార్జ్ చేయడానికి వెళ్లినప్పుడు నిందితుడు తన పెదవులను ముద్దాడటంతో పాటు, తన ప్రైవేట్ భాగాలను తాకాడని బాలుడు ఆరోపించాడు. ఆ తర్వాత.. బాలుడి తండ్రి నిందితులపై బాలల లైంగిక నేరాల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్లు, ఐపీసీ సెక్షన్ 377 కింద పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సెక్షన్ 377ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. శారీరక సంబంధం లేదా ఏదైనా ఇతర అసహజ చర్య సెక్షన్ 377 ప్రకారం శిక్షార్హమైన నేరం. దీని ప్రకారం.. గరిష్టంగా శిక్ష జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే బెయిల్ పొందడం కష్టం అవుతుంది.

అయితే ఈ కేసుకు సంబంధించి బాలుడికి జరిపన వైద్య పరీక్ష అతని లైంగిక వేధింపుల ఆరోపణకు మద్దతు ఇవ్వలేదని జస్టిస్ ప్రభుదేశాయ్ పేర్కొన్నారు. నిందితుడిపై విధించిన పోక్సో సెక్షన్ల కింద గరిష్టంగా ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని.. బెయిల్ మంజూరు చేయవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుత కేసులో అసహజ సెక్స్ అంశం ప్రాథమికంగా వర్తించదని జస్టిస్ ప్రభుదేశాయ్ అన్నారు.

‘‘బాధితుడి స్టేట్‌మెంట్, ఎఫ్‌ఐఆర్ ప్రాథమిక విచారణలో నిందితుడు బాధితుడి ప్రైవేట్ భాగాలను తాకినట్లు, అతని పెదవులను ముద్దాడినట్లు సూచిస్తున్నాయి. నా దృష్టిలో ఇది ప్రాథమికంగా భారత శిక్షాస్మృతి‌లోని సెక్షన్ 377 కింద నేరం కాదు’’ అని జస్టిస్ ప్రభుదేశాయ్ అభిప్రాయపడ్డారు. నిందితులు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని.. ఈ కేసులో విచారణ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం లేదని అన్నారు.. ఈ వాస్తవాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే నిందితుడు బెయిల్‌కు అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నిందితుడికి రూ. 30 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు.
 

click me!