
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. నేరస్తులను ఎంతగా శిక్షిస్తున్నా దేశంలో మహిళలపై రోజురోజుకు దారుణాలు పెరిగిపోతూనే వున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతుందన్న భరోసా లేకుండా పోయింది. సామాన్యులే కాదు ప్రముఖులు, చదువుకున్న వారిపైనా ఈ దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఓ మహిళా న్యాయవాదిపై ఓ వ్యక్తి అత్యంత అమానుషంగా దాడి చేశాడు. కడుపులో తన్నుతూ.. కొడుతూ కర్కశంగా ప్రవర్తించాడు. అంతేకాదు అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేశాడు.
వివరాల్లోకి వెళతే.. కర్ణాటక రాష్ట్రం (karnataka) బాగల్ కోట్‌లో (bagalkot) ఈ దారుణం జరిగింది. దాడి చేసిన వ్యక్తిని మహంతేశ్ చొలచగడ్డ, బాధితురాలిని సంగీత షిక్కేరిగా గుర్తించారు. ఇద్దరి మధ్యా ఆస్తి తగాదాల వల్లే మహంతేశ్ దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాగల్ కోట్‌లోని హార్టికల్చర్ సైన్సెస్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహంతేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ బాగల్ కోట్ జనరల్ సెక్రటరీ రాజు నాయకర్ తనను ఓ ఆస్తికి సంబంధించిన విషయంలో వేధిస్తున్నాడని, దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని బాధితురాలు వాపోయింది.
ఆ ఘటనకు సంబంధించే తనపై దాడి చేయించారని సంగీత ఆరోపించింది. అయితే, మహంతేశ్ మాత్రం బాధితురాలి వ్యాఖ్యలను ఖండించాడు. తాను ఎవరో చెబితే దాడి చేయలేదని స్పష్టం చేశాడు. ఇటు బీజేపీ నేత రాజు నాయకర్ కూడా సంగీత ఆరోపణలను ఖండించాడు. తాను చట్టపరంగానే ఇంటిని కొనుక్కున్నానని, తన అధికారాలను దుర్వినియోగం చేయలేదన్నారు. సంగీతపై దాడికి ఎవరినీ పంపలేదని పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం సంగీత, ఆమె భర్త బాగల్ కోట్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.