48 గంటల్లో 2.5 లక్షల మంది తరలింపు.. కేరళలో తెలుగు ఐఏఎస్ అధికారి సాహసం

By sivanagaprasad KodatiFirst Published Aug 28, 2018, 12:09 PM IST
Highlights

గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళపై ప్రకృతి కన్నెర్రజేసింది. వరదలు పోటెత్తి.. వూళ్లకు వూళ్లు మునిగిపోయాయి.. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ఎటు నుంచి వచ్చి ముంచెస్తుందోనని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. ఇలాంటి సమయంలో ఓ యువ ఐఏఎస్ అధికారి ముందు చూపు 2.5 లక్షల మంది ప్రాణాలను కాపాడింది

గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళపై ప్రకృతి కన్నెర్రజేసింది. వరదలు పోటెత్తి.. వూళ్లకు వూళ్లు మునిగిపోయాయి.. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరద ఎటు నుంచి వచ్చి ముంచెస్తుందోనని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. ఇలాంటి సమయంలో ఓ యువ ఐఏఎస్ అధికారి ముందు చూపు 2.5 లక్షల మంది ప్రాణాలను కాపాడింది.

రెండు రోజుల్లో 2.5 లక్షల మంది జనాభాను తరలించి ఆయన దేశప్రజల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. ఆయనే మన తెలుగు తేజం మైలవరపు కృష్ణతేజ.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ఐఏఎస్‌కు ఎంపికై కేరళలోని అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నెల 16 నాటికి కేరళను వరదలు ముంచెత్తాయి.. ఆ సమయంలో వరద పరిస్థితిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌తో కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారు కృష్ణతేజ.. ఈ సమయంలో పక్క జిల్లా శబరిమలైలో డ్యామ్ నీటిమట్టం పెరిగిందని సమాచారం అందింది. అంతే ఆయన క్షణాల్లో జరగబోయే ప్రమాదాన్ని ఊహించేశారు. అక్కడ ఒకటిన్నర మీటర్ల ఎత్తు పెరిగితే.. అలెప్పి జిల్లా కుట్టనాడ్‌ మునిగిపోతుందని గ్రహించారు. 2

4 గంటల నుంచి 48 గంటల లోపల ఆ ప్రాంతం మొత్తం వరద నీటితో మునిగిపోతుందని అంచనాకు వచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లోని 2.5 లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం వుందని  వెంటనే వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. కానీ అది అనుకున్నంత తేలిక కాదు. అక్కడ రవాణాకు ప్రధానంగా ఉపయోగించేది జలమార్గమే..

అది వరదల సమయం.. అంతటి విపత్కర పరిస్థితిలో సాహసం చేశారు కృష్ణతేజ.. వెంటనే అధికారులతో చర్చించి 17వ తేది తెల్లవారుజాము కల్లా జనాన్ని తరలించాలని ప్రణాళికను సిద్ధం చేశారు. పడవలెన్ని వున్నాయి.. వాటి యజమానులెవరు..? ఇంధనం పరిస్థితి ఏంటీ..? ఇలా ప్రతి సమాచారం సేకరించారు.. అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలిచ్చి ‘‘ఆపరేషన్ కుట్టినాడ్’’గా నామకరణం చేసి రంగంలోకి దిగారు.

అయితే వరద వచ్చే సూచనలు లేవు.. మేము సొంత ఇంటిని వదిలి వెళ్లమని స్థానికులు వాగ్వివాదానికి దిగడంతో.. బలవంతంగానైనా పునరావాస కేంద్రాలకు తరలించాలని కృష్ణతేజ ముందే ఆదేశాలు ఇవ్వడంతో.. అధికారులు దానిని అవలంభించారు. కొందరికి అర్థమయ్యేలా చెప్పారు. మొత్తం మీద 18 రాత్రి వరకు 14 గ్రామాల్లోని 2.5 లక్షల మంది సహా పశువులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తరలింపు మొదలుపెట్టిన 24 గంటల్లోపే ఆ ప్రాంతం మొత్తం వరద నీటితో నిండిపోయింది. రెండతస్తుల భవనాలు కూడా నీటిలో మునిగిపోయాయి. దీంతో తొలుత వ్యతిరేకించిన వారు కూడా తరువాత కృష్ణతేజను అభినందించారు. 700 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడారు.

కృష్ణతేజ కృషిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా సివిల్ సర్వీసుల అధికారుల సంఘం ప్రశంసించింది. జాగ్రఫీపై నాకున్న పరిజ్ఞానం, ఆర్థికమంత్రి ఐజాక్, అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతోనే ఇంతమంది ప్రాణాలను కాపాడగలిగామని కృష్ణతేజ తెలిపారు. ఆయన సాహసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ఒక పాఠంగా నిలిచిపోనుంది. 

click me!