ముగ్గురు హిందూ పిల్లలను కన్నపిల్లలుగా పెంచిన కేరళ ముస్లిం మహిళ.. ప్రేమను పంచిన ఆ మాతృమూర్తిపై సినిమా

By Mahesh KFirst Published Feb 6, 2023, 2:49 PM IST
Highlights

ముస్లిం ఇంటిలో పని చేసే ఓ హిందూ నిమ్న కులానికి చెందిన మహిళ మరణించింది. హిందూ మహిళకు జన్మించిన ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు. దీంతో ఆ ముస్లిం దంపతులు వారి ముగ్గురు పిల్లలతోపాటు ఈ ముగ్గురినీ సొంత పిల్లాల్లాగే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. హిందూ పిల్లలను సొంత పిల్లలుగానే పెంచిన ఆ ముస్లిం మహిళ పై ఇప్పుడు సినిమా వచ్చింది. 
 

మతం కన్నా మానవత్వం మిన్న. అమ్మకు పిల్లలను ప్రేమించడమే తెలుసు. మతమేంటో ఆమెకు అనవసరం. తన ఇంటిలో పని చేసే ఓ నిమ్న కులానికి చెందిన మహిళ(చక్కి) మరణించడంతో అనాథలైన ఆమె ముగ్గురు సంతానాన్ని అక్కున చేర్చుకుంది. తనకు పుట్టిన ముగ్గురు పిల్లలతోపాటు ఆ ముగ్గురినీ పెంచింది. వారందరికీ అమ్మ ప్రేమ పంచింది. చదివించింది. పెళ్లిళ్లు చేసింది. ముఖ్యంగా వారందరిలో మతానికి మించి ప్రేమను నింపింది. కన్నవాళ్లు ముస్లిం మతం ఆచరిస్తే ఆ ముగ్గురు పిల్లలు హిందువులుగానే పెరిగారు. అంతా ఒకే కుటుంబంగా కలిసి మెలసి, ప్రేమాప్యాయతలతో పెరిగారు. ఇది కేరళకు చెందిన ముస్లిం మహిళ సుబేదా గొప్పతనం.

చక్కి మరణించి 50 ఏళ్లు కావస్తున్నది. కానీ, అదంతా నిన్న జరిగినట్టే షానవాస్ గుర్తు చేసుకుంటాడు. అమ్మ సుబేదా జాఫర్‌ను నాకు అప్పగించి చక్కిని చివరిసారైనా చూడాలని కంటనీరుతో పరుగున వెళ్లిపోయింది. అమ్మకు చక్కి ఇంటిలో సహాయం చేసే పని మనిషి మాత్రమే కాదు స్నేహితురాలు కూడా. చక్కిని కడసారి చూడటానికి వెళ్లిన అమ్మ వెనక్కి వస్తూ ముగ్గురు పిల్లలను వెంట తెచ్చింది. ఇద్దరు బాలికలు రమణి, లీలాలు నడుస్తూ ఆమె వెంట రాగా.. చేతుల్లో చక్కి చిన్న కొడుకు శ్రీధరన్ పట్టుకొచ్చింది. ఏడేళ్ల షానవాస్ వారిని తన కొత్త తోబుట్టువులుగా జీవితంలోకి ఆహ్వానించాడు.

తెన్నదన్ సుబేదా, అబ్దుల్ అజీజ్ హాజీలు పవిత్రమైన ముస్లిం దంపతులు. మలప్పురం జిల్లా నీలాంబూర్‌లోని కాలికావు గ్రామస్తులు. వారి ఇంటి పని మనిషి ముగ్గురు సంతానాన్ని ఆ దంపతులు తమ జీవితమంతా సాకారు. ఆ ముగ్గురిని ఇస్లాం మతంలోకి మార్చకుండానే పెంచి పెద్ద చేశారు. సుబేదా కిడ్నీ సమస్యతో 2019 జులైలో కన్నుమూసింది. మరో రెండేళ్ల తర్వాత భర్త అజీజ్ హాజీ కూడా ఆమె వెంటే వెళ్లిపోయాడు. మనస్సులో ప్రేమను నింపుతున్న వారి కథను ఇప్పుడు ప్రముఖ ఫిలిం మేకర్ సిద్దిక్ పరవూర్ సినిమా తీయడానికి ఎంచుకున్నారు. ‘ఎన్ను స్వాంతమ్ శ్రీధరన్’(ప్రేమతో, శ్రీధరన్) అనే టైటిల్ పెట్టారు. చక్కి చిన్న కొడుకు శ్రీధరన్. జనవరి 9న ఎడపల్లిలో వనిత థియేటర్‌లో ప్రీమియర్ వేశారు.

ఇప్పుడు ఈ కథ ఎలా వెలికి వచ్చింది?
శ్రీధరన్ చేసిన ఫేస్‌బుక్ పోస్టుతో సుబేదా అజరామర ప్రేమ వెలుగులోకి వచ్చింది. జులై 2019లో మరణించిన సుబేదను ఒమన్‌లో ఉన్న శ్రీధరన్ కరోనా ఆంక్షల మూలంగా కడసారి చూడలేకపోయాడు. బాధతో ఫేస్‌బుక్‌లో అమ్మ(UMMA, ముస్లింలు మలయాళంలో అమ్మను పిలిచే పదం) అని సంబోధిస్తూ పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపడ్డారు. ఒక హిందువైన శ్రీధరన్ ముస్లిం మహిళను అమ్మ(వారు పిలిచే పిలుపులో) అని పిలవడమేంటని ఆరా తీశారు. అనుమానపోయారు. కొందరు ఇది ఫేక్ ఐడీనా? అని కూడా సంశయించారు. తన వాస్తవ జీవితంపై ఇన్ని అపనమ్మకాలు అలుముకోవడం ఏమిటన్న బాధలో నుంచి శ్రీధర్ మరుసటి రోజు ఓ వివరణతో పోస్టు పెట్టాడు. ప్రస్తుత సమాజంలోని ఉన్మాద పరిస్థితులను చీల్చేలా ఆ పోస్టు ఉన్నది. సుబేదా తనకు అమ్మకు ఎంతమాత్రం తక్కువ కాదని స్పష్టం చేయడానికి ఆ పోస్టు పెట్టాడు. అలా బయటి లోకానికి సుబేదా తెలిసింది. ప్రేమ, సహజీవనం గురించి మరోమారు లోకానికి ఆ పోస్టు పాఠం చెప్పింది. దాని అవసరం ఇప్పుడు ఎక్కువ ఉండటం చేత వైరల్ అయింది.

Also Read: పర్వేజ్ ముషారఫ్ మరణం: కార్గిల్ యుద్ధం మాస్టర్ మైండ్, కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నం.. ఆసక్తికర వాస్తవాలు

అమ్మ, అప్ప వద్దకు తాము వచ్చిన తర్వాతే వారికి జోషినా పుట్టిందని, తాము ఎప్పుడూ ఆ ఇంటిలో బయటివారం అనే ఫీలింగ్ రాలేదని శ్రీధరన్ ది న్యూస్ మినిట్‌కు చెప్పాడు. నాకు తెలిసిన నా ఎకైక ఇల్లు అదే. నాకు జాఫర్‌కు ఒకే సారి రొమ్ము పాలు ఇచ్చిందని విన్నట్టు గుర్తు చేసుకున్నాడు.

Tale of Kerala Muslim woman who raised three Hindu kids as her own is now a film. Heartwarming tale!https://t.co/s7swNjzxJR

— Shashi Tharoor (@ShashiTharoor)

‘నా గురించి ఆవరించిన అనుమానాలను తేటతెల్లం చేయడానికే ఈ పోస్టు పెడుతున్నా’ అని శ్రీధరన్ రాయడం మొదలు పెట్టాడు. ‘అమ్మ మరణించిందనే వార్త షేర్ చేయగానే మీలో కొందరికి అనుమానాలు వచ్చాయి. తకియా ధరించిన నా ఫొటో పెట్టినప్పుడూ ఒక ముస్లిం పేరు శ్రీధరన్ అని పెట్టుకుంటాడా? అనే డౌట్లూ వ్యక్తపరిచారు. నాకు ఏడాది నిండినప్పుడే తల్లి మరణించింది. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు. నాకు తండ్రి కూడా ఉన్నాడు. జన్మనిచ్చిన తల్లి చనిపోయిన రోజే అమ్మ, అప్ప నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నా అక్కలు పెళ్లీడుకు రాగానే అమ్మ, అప్ప వారి పెళ్లిళ్లు చేశారు. వారి సొంత పిల్లలు కూడా ఇందుకు అడ్డు చెప్పలేదు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పేగుచించుకు జన్మనిచ్చిన తల్లి మీదికి దత్తత తల్లి రాదని అంటారు. కానీ, అమ్మ ఎప్పుడూ మాకు దత్తత తల్లి కాదు. ఆమె నిజమైన అమ్మే’ అని శ్రీధరన్ తన పోస్టులో రాసుకున్నాడు. 

ఈ పోస్టు చదివినవారంతా షాక్ అయ్యారు. మీడియా, యాక్టివిస్టులు మొదలు సాధారణ పౌరుల వరకు చాలా మంది అసలు కథేమిటో తెలుసుకోవాలని ఫోన్లు చేశారని తెలిపాడు. ఒక మతాన్ని మరో మతానికి ఎదురుపెట్టి కయ్యం పెట్టిస్తున్న నేటి రాజకీయ వాతావరణంలో ఈ కుటుంబం మమ్మల్ని అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసిందని వివరించాడు. దేవుడిపై విశ్వాసం ఉంచుకోవాలందని, మా మతాన్నే విశ్వసించడానికి అడ్డు చెప్పలేదని, ఈ విషయాలు ప్రస్తుత వాతావరణంలో నమ్మశక్యం కాకపోవచ్చు కానీ, వాస్తవాలు అని పేర్కొన్నాడు. బయటి వారి నుంచి వచ్చే రియాక్షన్ చూసి మేమంతా ఆశ్చర్యపోతున్నామని అన్నాడు. ‘మేమంతా అక్కా చెళ్లెళ్లు.. అన్నాదమ్ములుగా పెరిగాం. మేం వేరు అనే భావన ఎప్పడూ మా దరికి రాలేదు’ అని షానవాస్ చెప్పాడు.

మతాలకు అతీతంగా:
ఇస్లాం మతంలోకి ఎదుకు మార్పిడి చేయలేదని శ్రీధరన్ అమ్మ, అప్పను అడిగిన రోజులను గుర్తు చేశాడు. ‘వారు మొదటి స్పందన బాధ్యత. ఎవరైనా నీకు తప్పుగా చెప్పి పోతే ఎలా అని వారు నన్ను అడిగారు. అలాంటిదేమీ జరగదని భరోసా ఇచ్చిన తర్వాత వారు వివరించి చెప్పారు. మతం ఎవరినీ నిర్వచించనీయమని వివరించారు. మతాలన్ని సారంలో ఒకే విషయం బోధిస్తాయని, అవి ప్రేమ, ప్రజలకు సహాయం చేయడం. మత బోధనలను మనుషులమైన మనమే తప్పుగా అర్థం చేసుకుంటాం అని వివరించారు’అని శ్రీధరన్ చెప్పాడు.

ఒక వేళ సుబేదా తమను ఆదరించకుంటే తమ జీవితాలను ఊహించలేమని శ్రీధరన్ అన్నాడు. తమ కుటుంబం నిమ్న కులానికి చెందినదని, మేం మౌనం దాల్చి, విధేయులుగా, ప్రశ్నించకుండా బతుకీడ్చాల్సి ఉండేదని తెలిపాడు. అప్పుడు కల్చర్ అలాగే ఉండింది అని వివరించాడు. కానీ, అమ్మ అలా ఉండకూడదని మాకు నేర్పిందని, అవసరం లేకుండా ఎక్కడా మోకరిల్లాల్సిన అవసరం లేదని చెప్పిందని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు, తాను ఇప్పుడు తండ్రి అయ్యాక ఆరుగురి పిల్లలను పెంచడం ఎన్ని సవాళ్లతో కూడుకున్నదో అర్థం అవుతున్నదని అన్నాడు.

click me!