ఆ బ్యాంకులు సిపిఎం కు ఏటీఎంలుగా మారాయి : కేరళ బిజెపి చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్

Published : Nov 23, 2026, 03:31 PM IST
Rajeev Chandrasekhar

సారాంశం

పయ్యన్నూర్ ఎమ్మెల్యే వి. కున్హికృష్ణన్ ప్రసంగాన్ని అడ్డుకున్న ఘటనపై స్పందిస్తూ కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీపీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఏకంగా రూ. 1,582 కోట్ల అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

కేరళలోని ఓ సహకార బ్యాంకు కార్యక్రమంలో పయ్యన్నూర్ ఎమ్మెల్యే వి. కున్హికృష్ణన్ ప్రసంగాన్ని అడ్డుకోవడం పొలిటికల్ హీట్ పెంచింది. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ (BJP) కేరళ అధ్యక్షులు రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు… సీపీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కేరళలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోవడానికి సీపీఎం నాయకత్వమే కారణమని కేరళ బిజెపి చీఫ్ ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శిపై జరిగిన దాడిని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. "అవినీతి గురించి మాట్లాడేవారి గొంతు నొక్కేందుకు రాజకీయ బెదిరింపులకు పాల్పడుతున్నారు" అని ఆయన మండిపడ్డారు.

సోమవారం ఎక్స్ (X) ద్వారా ఎమ్మెల్యే కున్హికుమార్ పై జరిగిన దాడి గురించి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ ఘటనను కేరళ రాజకీయాల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతోందని విమర్శించారు. కో-ఆపరేటివ్ బ్యాంకులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC), దేవస్వం బోర్డు, పోలీసు శాఖ లాంటి ప్రజా సేవా సంస్థలను సీపీఎం తన గుప్పిట్లోకి తీసుకుందని ఆయన ఆరోపించారు.

కన్నూర్ జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ వీక్ వేడుకల్లో కున్హికృష్ణన్ ప్రారంభోపన్యాసాన్ని అడ్డుకున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకోవడంతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై దాడి చేశారనే ఆరోపణలపై పయ్యన్నూర్ పోలీసులు ఎనిమిది మంది సీపీఎం కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో అవకతవకలు

కేరళ కో-ఆపరేటివ్ రంగంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో వివరిస్తూ చంద్రశేఖర్ తన పోస్ట్‌లో కొన్ని కీలక గణాంకాలను పంచుకున్నారు. గత 10 ఏళ్లలో కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రూ.1,582 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆయన వెల్లడించారు. 450 కో-ఆపరేటివ్ సొసైటీలు డిపాజిటర్ల డబ్బును తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నాయని, 251 సొసైటీల్లో అక్రమాలు జరిగినట్లు తేలిందని ఆయన తెలిపారు.

సుమారు రూ. 550 కోట్లకు సంబంధించిన 27 కో-ఆపరేటివ్ బ్యాంకుల కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తోందని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. కరువన్నూర్ కో-ఆపరేటివ్ బ్యాంక్ కేసులో ఈడీ ఇప్పటికే సుమారు రూ. 128 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిందని చంద్రశేఖర్ గుర్తు చేశారు. నేమమ్‌లో సుమారు రూ. 108 కోట్ల కోసం 1,200 మందికి పైగా డిపాజిటర్లు ఇంకా ఎదురుచూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బాధిత డిపాజిటర్లకు అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన రిస్క్ ఫండ్ స్కీమ్ ద్వారా వారికి ఉపశమనం కలిగించడంలో విఫలమైందని ఆయన ప్రశ్నించారు. అవినీతి, రాష్ట్రంలోని ఇతర ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ వివాదాలను సృష్టిస్తున్నాయని చంద్రశేఖర్ ఆరోపించారు.

బీజేపీ సారథ్యంలోని NDA తమ వికసిత కేరళం మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే.. కో-ఆపరేటివ్ సంస్థలను ప్రక్షాళన చేస్తామని, బాధిత డిపాజిటర్లకు న్యాయం చేస్తామని, బ్యాంకుల్లో పారదర్శకతను పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో దేశవ్యాప్తంగా కో-ఆపరేటివ్ రంగాలు అభివృద్ధికి ఇంజిన్లుగా మారుతుంటే, కేరళలో మాత్రం అవి "అవినీతి రాజకీయ నాయకులకు, వారి అనుచరులకు ఏటీఎంలుగా" మారిపోయాయని ఎద్దేవా చేశారు. సాధారణ డిపాజిటర్లను రక్షించేందుకు జవాబుదారీతనం, సంస్కరణలు తీసుకురావాలని కేరళ బిజెపి చీఫ్ పిలుపునిచ్చారు.

పయ్యన్నూర్ ఘటన ఏమిటి?

నవంబర్ 18న తాలిపరంబ సర్కిల్ కో-ఆపరేటివ్ యూనియన్ నిర్వహించిన కో-ఆపరేటివ్ వీక్ వేడుకల్లో భాగంగా కండోత్ కూర్మ ఆడిటోరియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (UDF) సపోర్ట్ కలిగిన స్వతంత్ర ఎమ్మెల్యే కున్హికృష్ణన్ ప్రారంభోపన్యాసం చేస్తుండగా, సభికుల్లో కొందరు నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు.

ఆందోళనకారులు స్టేజీ వైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పి. ప్రసన్నన్‌పై కొందరు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా ఎమ్మెల్యే, ఆయన సపోర్టర్స్ ఆడిటోరియం వెలుపల బైఠాయించి ఆందోళన చేశారు.

అంతకుముందు ఈ కార్యక్రమానికి ప్రారంభ వక్తగా ఎవరిని పిలవాలనే దానిపై కూడా వివాదం నెలకొంది. నిర్వాహకులు మొదట స్థానిక ఎమ్మెల్యేకి బదులుగా పయ్యన్నూర్ మున్సిపాలిటీ చైర్మన్ సరిన్ శశి పేరును ఖరారు చేశారు. అయితే సహకార శాఖ జోక్యంతో చివరకు కున్హికృష్ణన్‌ను కూడా ఈ కార్యక్రమంలో చేర్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ambani Family Wealth: అంబానీ కుటుంబంలో ఎవరి ఆస్తులు ఎక్కువ? ముఖేష్ అంబానీ పిల్లల సంపద ఎంతో తెలుసా?
Indian Railways: పెళ్లిళ్లు, యాత్రలకు వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. రైలు రిజర్వేషన్ రూల్స్ ఛేంజ్.. టికెట్ల బుకింగ్ సూపర్ ఈజీ