
ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుండి మొఘల్ చరిత్రపై అధ్యాయాలను తొలగించడాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. విద్యా సంబంధ పుస్తకాలకు కాషాయం మయం చేశారని మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ తమ అసలు రంగును బయటపెడుతోందని, చరిత్ర అంటే భయంతో జీవిస్తోందని విజయన్ అన్నారు. చరిత్రను తిరగరాసి అబద్ధాలతో కప్పిపుచ్చే పనిలో పడ్డదనీ, అందుకే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాలను, పలు పేరాలను తొలగించాలన్న బీజేపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.
సీఎం ఏం చెప్పారంటే..?
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎం విజయన్ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. "కాషాయీకరణ" ప్రోత్సహించే లక్ష్యంతో ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుండి కొన్ని అధ్యాయాలను, పాఠ్యాంశాలను తొలగించారని సీఎం విజయన్ ఆరోపించారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రేరేపిత నిర్ణయమన్నారు. చరిత్రను తిరస్కరించడమే.. కాకుండా తీవ్ర అభ్యంతరకరమని విజయన్ పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల నుండి పాఠ్యాంశాలను తొలగించడం ద్వారా చారిత్రక వాస్తవాలను పూర్తిగా విస్మరించలేమనీ, పాఠ్యపుస్తకాలను కాషాయికరణ చేయడమే ఇటువంటి చర్యల లక్ష్యమని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం పుస్తకాల నుండి కొన్ని భాగాలను ,అధ్యాయాలను తొలగించడం ఖండించదగిన చర్య అన్నారు. ఇలాంటి నిర్ణయాలతో పుస్తకాలు కాషాయమయం అవుతున్నాయని సీఎం అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ హత్య, ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం వంటి అధ్యాయాలను పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లోంచి తొలగించారని, దీని వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో అందరికీ తెలుసని విజయన్ అన్నారు.
చరిత్రను కప్పిపుచ్చడమే..
చరిత్ర పాఠ్యపుస్తకం నుండి మొఘల్ సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను తొలగించడంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యం లేకుండా భారతదేశ మధ్యయుగ చరిత్ర అసంపూర్ణమని అన్నారు. మధ్యయుగ భారతదేశ చరిత్రను సంఘ్ పరివార్ ఎప్పుడూ వక్రీకరిస్తునే ఉండని, సంఘ్ పరివార్ చరిత్రను కప్పిపుచ్చుతోందని సీఎం ఆరోపించారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని విజయన్ అన్నారు. లేకుంటే సంఘ్ లౌకిక విద్యను నిర్వీర్యం చేస్తుందని పేర్కొన్నారు.
NCERT క్లారిటీ
12 వ తరగతి పాఠ్యపుస్తకాల నుండి 2002 హింసకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించిన తర్వాత, NCERT 11వ తరగతి పుస్తకాల నుండి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన భాగాలను తొలగించింది. కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యను వైట్ వాష్ చేస్తోందని ఆరోపించారు. అలాగే.. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి గాంధీ హత్య, ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించిన వంటి అంశాలను తొలగించారు.
ఈ అంశంపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ మాట్లాడుతూ.. సిబిఎస్‌ఇ పాఠ్యపుస్తకాల నుండి మొఘల్‌లకు సంబంధించిన అధ్యాయాలను 'తొలగించలేదు' అని స్పష్టం చేశారు. అది "అబద్ధం" అని అన్నారు. కోవిడ్ కారణంగా విద్యార్థులపై ఒత్తిడి ఉన్నందున గత సంవత్సరం హేతుబద్ధీకరణ ప్రక్రియ జరిగిందని తెలిపారు. గతేడాది జూన్‌లోనే సిలబస్ రూపొందించామని ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్ దినేశ్ సక్లానీ తెలిపారు. ఈ ఏడాది సిలబస్‌లో ఎలాంటి తగ్గింపు లేదని తెలిపారు.