
పదకొండో జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ తలుపులు శుక్రవారం నాడు వేద మంత్రోచ్ఛారణల మధ్య చార్ ధామ్ యాత్రికుల కోసం తెరుచుకున్నాయి. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా ఆలయానికి హాజరయ్యారు. ఉదయం ఆరు గంటలకు ఈ తలుపులు తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. 06.26 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.
చార్ ధామ్ యాత్ర 2022 ప్రారంభానికి గుర్తుగా ముందుగా మే 3వ తేదీన గంగోత్రి ధామ్, యమునోత్రి ధామ్ తలుపులు తెరవబడ్డాయి. నేడు కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. నాలుగు తీర్థాలలో చివరిదైన బద్రీనాథ్ ధామ్ మే 8వ తేదీన తెరుచుకుంటుంది
భక్తుల కోసం ఆలయ తలుపులు తెరవడానికి కొన్ని గంటల ముందు CM పుష్కర్ సింగ్ ధామి తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా భక్తులకు స్వాగతం పలికారు. తమ ప్రభుత్వం సురక్షితమైన ప్రయాణాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా చార్ ధామ్ యాత్ర- 2022 కోసం యాత్రికుల సంఖ్యపై ప్రభుత్వం ప్రభుత్వం రోజువారీ పరిమితిని నిర్ణయించింది. కేదార్‌నాథ్ ఆలయానికి రోజువారీ యాత్రికుల పరిమితి 12,000 కాగా.. బద్రీనాథ్‌కు 15,000గా అధికారులు నిర్ణయించారు. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ద్ ధామ్ యాత్రకు కరోనా నెగిటివ్ పరీక్ష, కోవిడ్ -19 టీకా సర్టిఫికేట్ తప్పనిసరి కాదని తెలిపింది.
కేదార్‌నాథ్ ఆలయం ప్రారంభం శాస్త్రోక్తంగా, సంప్రదాయం ప్రకారం జరిగింది. ముందుగా కేదార్‌నాథ్ భగవాన్ పంచముఖి డోలీ మే 2న కేదార్‌నాథ్ శీతాకాల నివాసమైన ఓంకారేశ్వర్ ఆలయం నుండి బయలుదేరింది. ముందు విశ్వనాథ్ ఆలయం గుప్తకాశీ, శ్రీ గౌరీమాయి ఆలయం, ఫాటా, గౌరీకుండ్‌లతో పాటు పలు చోట్ల ఆగుతూ వచ్చింది. చివరికి కేదార్‌నాథ్ కు చేరుకుంది. ఈ ప్రారంభోత్సవం కోసం ఆలయాలన్ని పూలతో అందంగా అలంకరించారు.
మే 4వ తేదీన, వర్షం, మంచు కురుస్తున్నప్పటికీ ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండేళ్ల తర్వాత ఈసారి చార్ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నారు. కేదార్‌నాథ్‌ను సందర్శించేందుకు 1,90,000 మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 31 వరకు అంత మంది యాత్రికులు ఆలయాన్ని దర్శించుకోనున్నారు. కేదార్‌నాథ్ హెలీ సర్వీస్‌కు జూన్ 5 వరకు ప్రీ బుకింక్స్ పూర్తయ్యాయి.
కేదార్‌నాథ్ ఆలయ ప్రారంభోతవ్సం నాడు 12 వేల మంది దర్శించుకోనున్నారు. దీని కోసం వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే యాత్రికులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే నమోదు ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రయాణ మార్గంలో అన్ని ఏర్పాట్లు చేశారు. యాత్రలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.