
Kashmiri Pandit: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్‌లో సోమవారం కాల్పులు జరిపారు. స్థానికంగా ఓ దుకాణంలో షాప్ కీపర్ గా పనిచేస్తున్న కాశ్మీరీ పండిట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారని అధికారులు తెలిపారు. షోపియాన్‌లోని ఛోటిగాం గ్రామానికి చెందిన సోను కుమార్ అనే వ్యక్తిని బాధితుడుగా గుర్తించారు. బైక్ పైన వచ్చిన ఉగ్రవాదులు.. అతని చేతి, కాలిపై గాయపరిచారు. అతడిని శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాశ్మీరీ పండిట్ దుకాణదారుడిపై దాడి గురించి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. కాగా, గత 24 గంటల్లో ఉగ్రవాదులు ఏడుగురిపై కాల్పులు జరిపారు. పుల్వామాలో జరిగిన దాడిలో గాయపడిన వారిలో నలుగురు స్థానికేతరులు కూడా ఉన్నారు. శ్రీనగర్‌లో జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.
మరో ఘటనలో.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని మైసుమా వద్ద సోమవారం జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
అలాగే.. పుల్వామా జిల్లాలోని లాజూరా ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరిచారు. గాయపడిన వ్యక్తులను బీహార్‌కు చెందిన పట్లేశ్వర్ కుమార్, జాకో చౌదరిగా గుర్తించారు. ఉగ్రదాడుల్లో గాయపడిన కూలీలిద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు సమాచారం. అలాగే.. పుల్వామాలోని నౌపోరా ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు స్థానికేతర కూలీలను ఉగ్రవాదులు కాల్చి గాయపరిచిన 24 గంటల తర్వాత ఈ దాడి జరిగింది.
అలాగే.. సోమవారం శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఉగ్రవాదులు చేలరేగుతున్నారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న.. సీఆర్‌పీజీ సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన జవాన్లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే హెచ్‌సి విశాల్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. J&K పోలీసులు దాడులకు సంబంధించి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాలపై స్పందించిన J&K LG మనోజ్ సిన్హా స్పందించారు. "పౌరులు, CRPF సిబ్బందిపై జరిగిన ఘోరమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమరవీరులైన హెచ్‌సి విశాల్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మా భద్రతా దళాలు తుచ్ఛమైన దాడులకు పాల్పడిన వారికి తగిన సమాధానం ఇస్తాయి అని తెలిపారు.
ఈ దాడులను నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఖండిస్తూ.. ట్వీట్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన CRPF జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన జవాన్ కోసం ప్రార్థనలు. అతను పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నానని తెలిపారు.
PDP అధ్యక్షురాలు, J&K మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల వల్ల.. అమాయక కుటుంబాలు రోడ్డున పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.