
బెంగళూరు: కర్ణాటక మంత్రి వీ సోమన్న మరో వివాదంలో చిక్కారు. లబ్దిదారులకు భూ పట్టాలు పంపిణీ చేస్తుండగా ఓ మహిళ తనకు ప్లాట్ కేటాయించలేదని బాధపడుతూ ఆగ్రహంతో అక్కడికి వచ్చింది. తన బాధను వెళ్లగక్కేందుకు ఆమె మంత్రి వద్దకు వెళ్లింది. ఆమె తన వద్దకు రాగానే చెంప చెళ్లుమనిపించాడు. ఆమె అదేమీ పట్టించుకోకుండా మంత్రి కాళ్లపై పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కింది. కాగా, మంత్రి తనపై చేయి చేసుకోలేదని, తనను ఓదార్చాడని ఆమె వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన చామరాజనగర్ జిల్లా హంగాలా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
కర్ణాటక ల్యాండ్ రెవెన్యూ యాక్ట్‌లోని 94సీ సెక్షన్ కింద గ్రామీణ ప్రాంతంలో చేసిన ల్యాండ్ రెగ్యులరైజేషన్‌లో సుమారు 175 మంది టైటిల్ డీడ్‌లకు అర్హులయ్యారు. ఈ భూ పట్టాలను పంపిణీ చేయడానికి మంత్రి ఆ గ్రామానికి ఆదివారం మద్యాహ్నం 3.30 గంటలకు రావాల్సింది. కానీ, ఆయన రెండు గంటలు ఆలస్యంగా అక్కడికి వెళ్లారు. పట్టాల పంపిణీ మొదలు కాగానే.. అక్కడే ఉన్న కెంపమ్మ తనకు ప్లాట్ కేటాయించలేదని ఆక్రోశించింది.బాధ, ఆగ్రహంతో అక్కడ వాగ్వాదం చేసింది. తన బాధను చెప్పుకోవడానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మంత్రి వీ సోమన్న దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసింది.
Also Read: కర్ణాటక అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆనంద్ మామణి కన్నుమూత
ఆ మహిళ తన వద్దకు రాగానే మంత్రి కూడా సీరియస్ అయ్యారు. ఆ మహిళ చెంప చెళ్లు మనిపించాడు. దీంతో ఆమె ఖంగుతిన్నది. అయినా.. అవేమీ పట్టించుకోకుండా మంత్రి కాళ్లపై పడింది. తనకు ప్లాట్ కేటాయించాలని కోరింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా, సదరు మహిళ మాత్రం తనను మంత్రి కొట్టలేదని పేర్కొంది. ‘నాది చాలా పేద కుటుంబం. తనకు ల్యాండ్ కేటాయించాలని ఆయన పాదాలపై పడి ప్రాధేయపడ్డా. ఆయన తనను పైకి లేపి ఓదార్చాడు. ఆయన నన్ను ఓదార్చాడు కానీ వారు దాన్ని తప్పుగా చిత్రించి నన్ను కొట్టారని చెబుతున్నారు’ అంటూ కెంపమ్మ వివరించింది.
Also Read: ముస్లింల అఘాయిత్యాలపై మాట్లాడకుండా మార్చేశారు.. : ప్రధాని మోడీపై ఎంఐఎం చీఫ్ ఒవైసీ ఫైర్
‘ఆయన మాకు భూమి ఇచ్చాడు. మేం చెల్లించిన రూ. 4000 కూడా తిరిగి ఇచ్చేశాడు. దేవుళ్లతోపాటుగా ఆయన ఫొటోకూడా మేం పెట్టుకుంటాం. మా ఇంట్లో ఆయనను పూజిస్తాం’ అని తెలిపింది.