కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడుతున్న ఫలితాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వెలువడుతున్న ఫలితాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందా? మళ్లీ 2018 సీన్ రిపీట్ అవుతుందా?.. అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అదే మాట చెబుతున్నాయి. అదే నిజమైతే.. జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే న్యూస్ నేషన్-సీజీఎస్ బీజేపీ క్లియర్ మెజారిటీ వస్తుందని.. జీ న్యూస్- మాట్రీజ్ మాత్రం కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంటుందని అంచనా వేసింది. ఇక, మిగిలినవాటిలో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యతను అంచనా వేశాయి.
అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయనేది ఫలితాల తర్వాతే తేలనుంది. పలు సందర్భాల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు పూర్తిగా తప్పిన సందర్బాలు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్.. మిశ్రమ ఫలితాలను అంచనా వేయడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా జరిగిన పక్షంలో కాంగ్రెస్, బీజేపీలు ఎలాంటి వ్యుహం అనురిస్తాయనేది హాట్ టాపిక్ మారింది. జేడీఎస్ కింగ్ మేకర్ అయిన పక్షంలో.. హెచ్‌డీ కుమారస్వామి ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది కూడా ఆసక్తికర పరిణామమే అని చెప్పాలి.
అయితే ఫలితాల అనంతరం ఏ పార్టీ అయినా మెజారిటీ మార్క్‌కు ఒకటి, రెండు సీట్ల దూరంలో నిలిచిపోతే.. ఇతరులు కీలక భూమిక పోషించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక, కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. మెజారిటీ మార్క్ 113 సీట్లుగా ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.
ఎగ్జిట్ పోల్స్..
ఏబీపీ-సీ ఓటర్.. బీజేపీ 83-95, కాంగ్రెస్ 100-112, జేడీఎస్ 21-29, ఇతరులు 2-6
న్యూస్ నేషన్-సీజీఎస్.. బీజేపీ 114, కాంగ్రెస్ 86, జేడీఎస్ 21, ఇతరులు 3
రిపబ్లిక్ టీవీ.. బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6
ఏషియానెట్ న్యూస్-జన్‌కీ బాత్.. బీజేపీ 94-117, కాంగ్రెస్ 91-106, జేడీఎస్ 14-24, ఇతరులు 0-2
టైమ్స్ నౌ-ఈటీజీ.. బీజేపీ 85, కాంగ్రెస్ 113, జేడీఎస్ 23, ఇతరులు 3,
టీవీ9 భారతవర్ష్-పోల్‌స్ట్రాట్.. బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
జీ న్యూస్- మాట్రీజ్.. బీజేపీ 79-94, కాంగ్రెస్ 103-118, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5
గతంలో ఏం జరిగింది..?
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 104 స్థానాలు సాధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 80 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా.. జేడీఎస్ 37 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో యడియూరప్ప మూడు రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది.
ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏడాదికే కుప్పకూలింది. అనంతరం బీజేపీ మళ్లీ పగ్గాలు చేపట్టింది. సీఎంగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టారు. అయితే 2021 జూలైలో యడియూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టారు.