Karnataka Elections 2023: ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

Published : May 10, 2023, 06:55 PM ISTUpdated : May 10, 2023, 07:07 PM IST
Karnataka Elections 2023: ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎగ్జిట్ పోల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తున్నాయి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. దీంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఏషియానెట్ సువర్ణ న్యూస్- జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం.. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టుగా తెలుస్తోంది.  అయితే కొంత బీజేపీకే ఎడ్జ్ ఉండే అవకాశం కనిపించింది. బీజేపీ 94 నుంచి 117 స్థానాల్లో, కాంగ్రెస్‌ పార్టీ 91 నుంచి 106 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏషియానెట్ సువర్ణ న్యూస్-జన్‌కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇక, జేడీఎస్ 14 నుంచి 24 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని.. ఇతరులు రెండు చోట్ల విజయం సాధిస్తారని పేర్కొంది. 

అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల మధ్య పోటీ నెలకొంది. అన్ని పార్టీలు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించాయి. కర్ణాటకలో అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పావులు కదిపితే.. రాష్ట్రంలో గత 38 ఏళ్లుగా ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తూ వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. అయితే జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 

ఇక, ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 25తో ముగియనుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. అధికారం చేపట్టాలంటే 113 మంది ఎమ్మెల్యేల  మద్దతు ఉండాలి. అయితే 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కర్ణాటకలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో యడియూరప్ప మూడు రోజులకే గద్దె దిగాల్సి వచ్చింది. 

 

ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయగా.. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఏడాదికే కుప్పకూలింది. అనంతరం బీజేపీ మళ్లీ పగ్గాలు చేపట్టింది. సీఎంగా యడియూరప్ప బాధ్యతలు చేపట్టారు. అయితే 2021 జూలైలో యడియూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. అధికారం చేపట్టాలంటే 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇక, ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం 119, కాంగ్రెస్‌ సంఖ్యాబలం 75, జేడీఎస్‌ సంఖ్యాబలం 28గా ఉంది.


ఇక, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు వరకు కర్ణాటకలో 65 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఏడాది మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. మొత్తం ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో  మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉండగా.. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 58,545 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లలో పురుషులు 2,67,28,053 మంది, మహిళలు 2,64,00,074 మంది, ఇతరులు 4,927 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 11,71,558 మంది యువ ఓటర్లు, 5,71,281 మంది వికలాంగులు (పీడబ్ల్యూడీ) ,  12,15,920 మంది 80 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. 

కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 స్థానాలకు మొత్తం 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న 2,613 మంది అభ్యర్థుల్లో 2,427 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఉన్నారని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో.. 224 మంది బీజేపీ, 223 మంది కాంగ్రెస్ (మేలుకోటేలో సర్వోదయ కర్ణాటక పార్టీకి మద్దతు), 207 మంది జేడీ(ఎస్), 209 మంది ఆప్, 133 మంది బీఎస్పీ, నలుగురు సీపీఐ(ఎం), ఎనిమిది మంది జేడీ(యూ), ఇద్దరు ఎన్సీపీ నుంచి బరిలో ఉన్నారు. 685 మంది రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు (ఆర్‌యూపీపీ) చెందిన వారు కాగా.. 918 మంది స్వతంత్రులు ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu