
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ రాజకీయ దృశ్యం కూడా మారుతూ వస్తోంది. నెల రోజుల క్రితం వరకు అక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినట్టుగా కనిపించగా.. ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా పరిస్థితులు మారినట్టుగా కనిపిస్తోంది. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్- జన్ కీ బాత్ సర్వేలో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో వీవీఐపీలుగా ఈ ఆరుగురు నేతల నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
బసవరాజ్ బొమ్మై (షిగ్గావ్, హవేరి)
ప్రస్తుతం బసవరాజ్ బొమ్మై రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆయన నేతృత్వంలోనే బీజేపీ ప్రస్తుతం ఎన్నికలకు వెళ్తుంది. ఇక, గత నెల రోజులుగా ముఖ్యమంత్రి జిల్లా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముంబై కర్నాటక ప్రాంతంలోని హవేరీ జిల్లాలో బీజేపీ లాభపడుతుందని తాజా ఏషియానెట్ న్యూస్ సర్వే తెలియజేస్తోంది. హవేరీలోని ఆరు సీట్లలో.. మార్చి-ఏప్రిల్ సర్వేలో బీజేపీ 4 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా.. తాజా సర్వే ప్రకారం బీజేపీ ఒక సీటును ఎక్కువగా పొందుతుందని తెలుస్తోంది. జిల్లాలో ఆరు స్థానాలకు గాను ఐదు స్థానాల్లో బీజేపీ కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. ఇంకో స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది.
సిద్ధరామయ్య (వరుణ, చామరాజ్‌నగర్)
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు వరుణ నుండి గెలుస్తారని అంచనా వేయగా.. పాత మైసూర్ ప్రాంతంలోని చామ్‌రాజ్‌నగర్ జిల్లాలో ఆయన పార్టీ ఏ విధమైన ప్రాబల్యం పొందినట్లు కనిపించడం లేదు. తాజా ఏషియానెట్ న్యూస్ సర్వే ప్రకారం జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు మొత్తం నాలుగు స్థానాల్లో రెండేసి సీట్లు పంచుకుంటున్నాయి. కిందటి సర్వే సమయంలోనూ ఇదే ట్రెండ్ కనిపించింది.
హెచ్‌డీ కుమారస్వామి (చన్నపట్న, రామనగర)
పాత మైసూర్ ప్రాంతంలోని మరో జిల్లా రామనగర. ఈ జిల్లాలో చన్నపట్న నుంచి జేడీఎస్ ముఖ్య నేత, మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ఇక్కడ జేడీఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. తాజా సర్వే అంచనా ప్రకారం.. జిల్లాలో జేడీఎస్ ఆధిక్యత కనబరుస్తుంది. జిల్లాలో మొత్తం నాలుగు సీట్లలో మూడింటిని జేడీఎస్ కైవసం చేసుకుంటుందని సర్వే అంచనా వేసింది. గత సర్వేలో ఇక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌లు చెరో రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
జగదీష్ షెట్టర్ (హుబ్లీ, ధార్వాడ్)
బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి జగదీశ్ షట్టర్ మారడం ఎన్నికల ప్రచారంలో ఎక్కువ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. లింగాయత్ ప్రముఖ నాయకులలో ఒకరిగా ఉన్న జగదీష్ షెట్టర్ బీజేపీ ఎన్నికల టిక్కెట్ నిరాకరించిన తరువాత పార్టీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే జగదీష్ షెట్టర్ నిర్ణయం బీజేపీలోకి కొందరికి బాధను కూడా కలిగించింది. ముంబై-కర్ణాటక బెల్ట్‌లోని ధార్వాడ్ జిల్లాలో షెట్టర్ రాకతో తమ ఎన్నికల అవకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే తాజా ఏషియానెట్ న్యూస్ సర్వే ప్రకారం.. సీట్ల అంచనాల పరంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. తాజా సర్వే ప్రకారం ఇక్కడ ఉన్న ఏడు సీట్లలో నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకోగా, మిగిలిన మూడింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మార్చి-ఏప్రిల్‌లో గత సర్వేలో సరిగ్గా ఇదే అంచనా వేసింది.
డీకే శివకుమార్ (కనకపుర, బెంగళూరు రూరల్)
బెంగళూరు రూరల్‌లో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కనకపుర నియోజకవర్గం నుంచి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ బరిలో నిలిచారు. దీంతో జిల్లాలోని కనకపురతో పాటు మరో మూడు స్థానాల్లో కూడా కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ఆయన శ్రమిస్తున్నారు. అయితే ప్రయత్నాలు పూర్తిగా విజయవంతం అయ్యేలా కనిపించడం లేదు. గత సర్వే నాలుగు సీట్లలో రెండు స్థానాలను జేడీ-ఎస్ గెలుచుకోగా, బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు గెలుచుకుంటాయని అంచనా వేసింది. తాజా సర్వే ప్రకారం జేడీఎస్‌కు పార్టీకి మద్దతు తగ్గిపోయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. తాజా సర్వే ప్రకారం నాలుగు స్థానాల్లో.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీ, జేడీఎస్‌లు ఒక్కొక్కటి గెలుపొందవచ్చని తెలుస్తోంది.
బీవై విజయేంద్ర (షికారిపుర, శివమొగ)
మధ్య కర్ణాటకలోని శివమోగ జిల్లాలోని షికారిపుర స్థానం నుంచి పోటీ చేసేందుకు విజయేంద్ర సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయనపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఖాళీ చేసిన ఈ నియోజకవర్గం ఆయన కుమారుడు విజయేంద్ర గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది. యడియూరప్ప పోటీలో లేకపోయినప్పటికీ జిల్లా బీజేపీ కంచుకోటగా మిగిలిపోతుందని తాజా ఏషియానెట్ న్యూస్ సర్వే తెలియజేస్తోంది. ఏడు సీట్లలో బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు రెండు, జేడీఎస్‌కు ఒక సీట్లు వస్తాయని అంచనా వేసింది. గత సర్వే కూడా ఇదే విధమైన అంచనా వేసింది.