జనం ఆకలితో చస్తుంటే.. కొత్త పార్లమెంట్ అవసరమా: మోడీపై కమల్ విసుర్లు

By Siva KodatiFirst Published Dec 13, 2020, 3:03 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు

కేంద్ర ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మండిపడ్డారు. దేశంలో సగం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం అవసరమా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉన్నప్పుడు భారీ వ్యయంతో నూతన పార్లమెంట్‌ను నిర్మించడం ఎందుకు? అని విలక్షణ నటుడు ప్రశ్నించారు. కరోనా వైరస్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయి దేశంలోని సగం మంది ప్రజలు ఆకలితో బాధపడుతుంటే రూ.1000 కోట్లతో నూతన పార్లమెంట్‌ను నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు.

ప్రజలను రక్షించేందుకే గ్రేట్‌ వాల్‌ ఆఫ్ చైనాను నిర్మించాం అని ఆ దేశ పాలకులు పేర్కొన్నారని.. కానీ ఆ గోడను నిర్మిస్తున్న క్రమంలోనే వేలాదిమంది కార్మికులు మరణించారని కమల్ హాసన్ గుర్తుచేశారు. ఇప్పుడు ఎవరిని రక్షించేందుకు నూతన పార్లమెంట్‌ను నిర్మిస్తున్నారని ప్రధాని సమాధానం చెప్పాలని లోకనాయకుడు ట్వీట్ చేశారు. 

కాగా , వచ్చే ఏడాది మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కమల్‌ మధురై నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అవినీతి, నిరుద్యోగం, గ్రామాభివృద్ధి, తాగు నీరు తదితర అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. భారతీయ చిత్రకళ, సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొత్త పార్లమెంట్ భవనం ఉండనుంది. 2022 ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయానికి దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోనుంది. 

click me!