జనవరిలో వ్యాక్సిన్ డ్రైవ్.. అక్టోబర్‌ నాటికి సాధారణ పరిస్ధితి: సీరం

By Siva KodatiFirst Published Dec 13, 2020, 2:32 PM IST
Highlights

అక్టోబర్ నాటికి భారతదేశంలో సాధారణ పరిస్ధితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా. భారతీయులందరికీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు

అక్టోబర్ నాటికి భారతదేశంలో సాధారణ పరిస్ధితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదార్ పూనావాలా. భారతీయులందరికీ త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.

ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 జనవరిలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నెల చివరినాటికి సీరమ్‌ తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని పూనావాలా పేర్కొన్నారు.

వచ్చే ఏడాది అక్టోబర్‌ కల్లా దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. టీకాకు అనుమతి లభిస్తే 2021 జనవరి నాటికి వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తామనే నమ్మకం ఉందని పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు.  

కాగా, తమ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలని సీరమ్‌తోపాటు భారత్ బయోటెక్ సంస్థలు కొద్ది రోజుల క్రితం డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను కోరాయి.

వీటి దరఖాస్తులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నిపుణుల కమిటీ పరిశీలించింది. టీకాల భద్రత, సమర్థతను తెలిపే అదనపు సమాచారం ఇవ్వాలని ఇరు సంస్థలను సీడీఎస్‌సీఓ కోరింది.

సీరమ్‌ సమర్పించిన అత్యవసర వినియోగ అనుమతుల దరఖాస్తును పరిశీలించిన సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ).. 2, 3 దశల్లో జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను సమర్పించాల్సిందిగా కోరింది. ఎస్‌ఈసీ ఆదేశం మేరకు 2, 3 దశల్లో జరిపిన పరీక్షలకు సంబంధించిన డేటాను సీరమ్‌ సంస్థ కమిటీకి సమర్పించిన సంగతి తెలిసిందే. 
 

click me!