Latest Videos

పార్లమెంట్‌ను మళ్లీ కుదిపేసిన పెగాసస్‌‌.. మోడీ రాజులా వ్యవహరిస్తున్నారన్న రాహుల్, బీజేపీ ఎదురుదాడి

By Siva KodatiFirst Published Feb 2, 2022, 7:41 PM IST
Highlights

చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమీషన్, పెగాసస్ (pegasus) వంటి వాటితో రాష్ట్రాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

దేశంలో 48 శాతం మంది ప్రజల ఆదాయం పడిపోయిందన్నారు కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi). పార్లమెంట్ బడ్జెట్ (parliament budget session 2022) సమావేశాలలో భాగంగా బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో విజన్ లేదన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. దేశంలో పేదలను కొల్లగొట్టి ధనికులకు పంచుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమీషన్, పెగాసస్ (pegasus) వంటి వాటితో రాష్ట్రాల గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

ప్రధాని స్వయంగా ఇజ్రాయెల్ (modi israel visit) పర్యటనకు వెళ్లి పెగాసస్ స్పైవేర్‌పై ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే రాహుల్ విమర్శలకు ధీటుగా బదులిచ్చింది అధికార పక్షం. పెగాసస్ అంశం కోర్టు (supreme court) పరిధిలో వుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. తనను అగౌరవపరిస్తే తాను బాధపడనని.. కానీ దేశ ప్రజలను అగౌరవపరిస్తే ఊరుకోనని రాహుల్ గాంధీ అన్నారు. ఈ దేశం కోసం మా కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని ఆయన గుర్తుచేశారు. 

దేశంలో రాచరిక వ్యవస్థ నడుస్తున్నట్లుగా కనిపిస్తోందని.. మోడీ (narendra modi) ఓ రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మా నానమ్మను చంపేశారని.. మా నాన్నను బాంబులతో పేల్చేశారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ కలిసి ఈ దేశ పునాదులతో ఆడుకుంటున్నాయని.. దేశ పునాదులను బలహీనపరుస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. గడిచిన పదేళ్లతో పోలిస్తే దేశం బలహీనపడిందని.. దేశం ప్రస్తుతం పొరుగుదేశాల మధ్య ఒంటరయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలకు దేశంలో విలువ లేదన్నారు.

కాగా.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం.. పార్లమెంట్ ఎగువ, దిగువ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం సందర్భంగా రాష్ట్రపతి భారత స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకున్నారు. వారికి నివాళులు అర్పించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం స్మరించుకుందని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో భారతీయులు ఒక టీమ్‌గా పని చేశారని వివరించారు. భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చెప్పారు. 90 శాతం మంది వయోధికులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకుని ఉన్నారని పేర్కొన్నారు. ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించే పనిలో ప్రభుత్వం ఉన్నదని తెలిపారు.
 

click me!