
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు కమీషన్ల కోసం కక్కుర్తిపడటం వల్లనే అమాయక గిరిజనుల ప్రాణాలు పోతున్నాయని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (acchennayudu) ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కమీషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని, అంత ధరలు చెల్లించలేక ప్రజలకు కల్తీ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగిలో జీలుగు కల్లు తాగి నలుగురు గిరిజనులు అందుకే మరణించారని తెలిపారు. ఈ పాపం ప్రభుత్వానిదే దక్కుతుందని అన్నారు.
కల్తీ కల్లు తాగి మృతి చెందిన ఘటనకు ఏపీ సీఎమే పూర్తి బాధ్యత వహించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మద్యం రేట్లు పెంచటం, నాసిరకం మద్యం అమ్ముతుండటంతోనే ప్రజలు కల్తీ కల్లు వైపు దృష్టి సారిస్తున్నారని, శానిటైజర్ వంటివి తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో రాష్ట్రంలో సుమారు 50 మందికిపైగా శానిటైజర్ తాగి మృతి చెందారని అన్నారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డున పడడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆయన తెలిపారు. సీఎం ఇప్పటి నుంచి అయినా కమీషన్ల కోసం కాకుండా ప్రజల ప్రాణాల గురించి ఆలోచించాలని అచ్చెన్నాయుడు సూచించారు. మృతి చెందిన గిరిజనుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఏం జరిగిందంటే.. ?
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో పలువురు గిరిజనులు ఎప్పటి జీలుగు కల్లును తాగారు. కొంత సమయం తరువాత ఆ కల్లు వికటించింది. అందరూ అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వెంటనే వారిని దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్ మెంట్ పొందుతున్న సమయంలోనే ఒకరు చనిపోయారు. దీంతో మిగిలిన వారిని మెరుగైన చికిత్స కోసం అడ్డతీగల హాస్పిటల్ కు తీసుకెళ్తున్న సమయంలోనే నలుగురి పరిస్థితి విషమించింది. దీంతో వారు మృతి చెందారు. ఒకేసారి ఐదుగురు గ్రామస్తులు మరణించడంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్ సేకరించారు. గిరిజన మృతికి కల్తీ కల్లు కారణమా ? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.