
Madvi Hidma : దేశ రాజధాని న్యూడిల్లీలో వాతావరణ కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వాయుకాలుష్యం ముసుగులో కొందరు విద్యార్థులు మావోయిస్టులకు సపోర్ట్ గా నిరసనకు దిగారు... ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్కౌంటర్ కు గురయిన మావోయిస్ట్ అగ్రనేత మాద్వి హిడ్మా పోస్టర్లు, అనుకూల నినాదాలు కలకలం రేపాయి.
చలికాలం రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం స్థాయి నిరంతరం పడిపోతోంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణాంకాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ కాలుష్యం మాటున రాజకీయాలు జరుగుతున్నాయి. ఆదివారం (నవంబర్ 23న) ఇండియా గేట్ వద్ద జేఎన్‌యూ విద్యార్థులు కాలుష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇందులో పాల్గొన్న వామపక్ష అనుకూల విద్యార్థిసంఘాల నాయకులు మావోయిస్టులకు సపోర్ట్ గా పోస్టర్లు ప్రదర్శించారు.
ఢిల్లీలో క్షీణిస్తున్న గాలి, పెరుగుతున్న కాలుష్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అదే సమయంలో విద్యార్థులు ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ హిడ్మా అమర్ రహే అని నినాదాలు చేశారు.
నిరసనకారులు మావోయిస్టు కమాండర్ హిడ్మా పోస్టర్లను పట్టుకుని నక్సల్ ప్రభావిత రాష్ట్రాలను ప్రశంసించారు. నిరసన చేస్తున్న అమ్మాయిలు హిడ్మాకు సపోర్ట్ గా, "ఛత్తీస్‌గఢ్‌లో చూడండి, ఎంత స్వచ్ఛమైన గాలి ఉందో. అక్కడ నక్సలైట్లు కాలుష్యాన్ని నియంత్రించారు" అని అన్నారు. విద్యార్థులు మావోయిస్టులకు సపోర్ట్ గా బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించారు.
హిడ్మా గిరిజన పోరాటానికి ప్రతీక అని, వాయు కాలుష్యానికి సంబంధించిన గిరిజన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకురావాలని కొందరు నిరసనకారులు మీడియాతో అన్నారు. ఈ సమయంలో హిడ్మా అమర్ రహే అనే నినాదాలు చాలాసార్లు వినిపించాయి. బీజేపీ నాయకులు ఈ నినాదాలను తీవ్రంగా ఖండించారు, ఇది నిరసన అసలు ఉద్దేశ్యాన్ని దారి మళ్లించేలా ఉందని అన్నారు.