జేఎన్ యూలో బీబీసీ డాక్యుమెంటరీ రగడ.. క్యాంపస్ లో ప్రదర్శన రద్దు..

By Rajesh KarampooriFirst Published Jan 23, 2023, 11:04 PM IST
Highlights

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) అడ్మినిస్ట్రేషన్  ప్రధాని నరేంద్ర మోడీపై రూపొందించిన వివాదాస్పద బిబిసి డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేసింది. పరిపాలన విభాగం ప్రకారం.. ఈ ప్రదర్శన క్యాంపస్‌లో ప్రశాంతత, సామరస్యానికి భంగం కలిగించవచ్చని హెచ్చరించింది. 

BBC డాక్యుమెంటరీ వివాదం: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని బ్లాక్‌ చేయాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి  డాక్యుమెంటరీని 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో చిత్రీకరించారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ అల్లర్లకు సూత్రధారిగా చిత్రీకరిస్తూ.. డాక్యుమెంటరీ రూపకల్పన చేశారు. నిజానికి ఈ కేసులో ప్రధాని మోదీ సహా పలువురు బీజేపీ నాయకులకు గతంలోనే సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కూడా గుర్తు చేసింది. భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య అనీ, విభజించు-పాలించు అనేది బ్రిటిష్‌ వారి నైజమనీ, ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ.. భారత్ మాత్రం అందరినీ కలుపుకొనిపోతుందనీ, ఈ విషయాన్ని బీబీసీ గుర్తుంచుకోవాలని పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో బీబీసీ డాక్యుమెంటరీ కలకలం చేలారేగింది. ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ పోస్టర్‌ని విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ షేర్ చేశారు. ఐషే ఘోష్ తన ఫేస్‌బుక్ పేజీలో "ఇండియా: ది మోడీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరీని ప్రదర్శించడం గురించి మాట్లాడారు. దీని స్క్రీనింగ్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు ఎన్నికబడిన ప్రభుత్వంచే నిషేధించబడిన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన కోసం మాతో చేరండి అని పోస్టు చేశారు. ఐషే ఘోష్ పోస్ట్ వైరల్ కావడంతో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ జారీ చేసింది.

వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనపై నిషేధం  

ఇలాంటి అనధికార కార్యక్రమాలు యూనివర్సిటీ క్యాంపస్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని జెఎన్‌యు అడ్మినిస్ట్రేషన్ సలహా ఇచ్చింది. ఇలాంటి వివాదాస్పద కార్యక్రమాలు చేయవద్దని విద్యార్థులకు సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడిన విద్యార్ధులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. JNU (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకారం.. యూనివర్సటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి లేకుండా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రదర్శించడానికి JNUSU పేరుతో కొంతమంది విద్యార్థులు కరపత్రాలు పంపిణీ చేశారు. జనవరి 24 రాత్రి 9 గంటలకు స్క్రీనింగ్ గురించి సమాచారం ఇవ్వబడింది. ఇలాంటి చర్చలకు పాల్పడకూడదనీ, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని సూచించారు.  ..

ఇటీవలి కాలంలో BBC డాక్యుమెంటరీని భారతదేశంలో నిషేధించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడి ఆహ్వానం మేరకు వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థులు ఇలాంటి డాక్యుమెంటరీని క్యాంపస్‌లో బలవంతంగా ప్రదర్శించకూడదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జేఎన్‌యూ క్యాంపస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.

click me!