మేం ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.. జడ్జీలు ఒక్కసారి నియామకమైతే చాలు: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు

By Mahesh KFirst Published Jan 23, 2023, 8:29 PM IST
Highlights

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు జడ్జీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిసారి ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పును ఎదుర్కొంటామని అన్నారు. కానీ, న్యాయమూర్తులు ఒక్కసారి నియామకమైతే చాలని, వారు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని వివరించారు.
 

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయమూర్తులపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, పబ్లిక్ స్క్రుటినీని ఎదుర్కోవలసిన అవసరం ఉండదని అన్నారు.తాము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని, ప్రజా తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తమ పని తీరును బట్టి ప్రజలు తమకు ఓటు వేస్తారని వివరించారు. కానీ, న్యాయమూర్తులకు ఆ అవసరం లేదని తెలిపారు. వారు ఒక్కసారి న్యాయమూర్తి అయితే చాలని అన్నారు. కానీ, ప్రజలు ప్రతీది గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలు న్యాయమూర్తులను చూస్తున్నారని, వారి తీర్పులు, కేసులో న్యాయం చెప్పడం తీరు, వారి పని తీరు ప్రతీది అబ్జర్వ్ చేస్తున్నారని వివరించారు. పరీక్షించి ఒక అంచనాకు వస్తారని, ఆ తర్వాత అభిప్రాయాలను ఏర్పరుచుకుంటారని తెలిపారు.

ఒకప్పుడు సోషల్ మీడియా లేదని, ఇప్పుడు ప్రతీదాన్ని చర్చించుకుంటున్నారని వివరించారు. ఇప్పుడు న్యాయమూర్తులపైనా చర్చలు జరుగుతున్నాయని, వారిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ మాట్లాడటానికి ఒక వేదికగా మారిందని వివరించారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వ్యాఖ్యలను నియంత్రించాలంటే ఎలా? ఆ పని చేయాలని చీఫ్ జస్టిస్ తమకు రిక్వెస్ట్ చేశారని కిరణ్ రిజిజు తెలిపారు. దీనిపై నోట్ తీసుకున్నామని, పరిష్కారం కూడా చూపామని వివరించారు.

Also Read: జ్యూడీషియరీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం : ఏది సవ్యమైనదంటే.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి లేటెస్ట్ కామెంట్ ఇదే

పరిస్థితులు ఎప్పటి కప్పుడు మారుతూ ఉంటాయని, ప్రజల ఆలోచన లూ మారుతాయని వివరించారు. అందుకే రాజ్యాంగాన్ని కూడా చాలాసార్లు సవరించాల్సి వచ్చిందని అన్నారు. ఏదైనా మార్పుకు లోను కాకుండా ఎల్లకాలం కొనసాగుతుందని భావించడం సరికాదని వివరించారు. బేసిక్ స్ట్రక్చర్ కూడా రాజ్యాంగంలో భాగంగా లేదని రేపు ప్రజలు అంటారేమో అని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం ఏది న్యాయం, దేన్ని అనుసరించాలనే దాన్ని చెబుతూ పోతే.. అది తప్ప కుండా మార్పుకు గురవుతుందని అన్నారు.

click me!