జార్ఖండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై మూక దాడి, గ్యాంగ్ రేప్.. 10 మందిపై కేసు

By Mahesh KFirst Published Oct 22, 2022, 12:33 PM IST
Highlights

జార్ఖండ్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఫ్రెండ్ తో కలిసి బైక్ రైడ్ కోసం బయటకు వచ్చిన ఆ యువతిని రేప్ చేశారు. తెక్రాహతు ఏరియాలోని ఎరోడ్రోమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సమీప గ్రామం నుంచి అనుమానిత యువకులను పోలీసు స్టేషన్‌కు తెచ్చి ఇంటరాగేషన్ చేస్తున్నారు.
 

రాంచీ: జార్ఖండ్‌లో దారుణం జరిగింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కొందరు దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారం చేశారు. పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జార్ఖండ్‌లోని చైబాసాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం, ఝిక్‌పానీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఆమె తన ఫ్రెండ్‌తో కలిసి సాయంత్రం 6 గంటలకు బైక్ రైడ్ కోసం బయటకు వచ్చింది. తెక్రాహతు ఎయిర్‌స్ట్రిప్ వైపు రైడ్ చేయడానికి వెళ్లారు. అక్కడ రోడ్డుపై నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అటు వైపుగా ఎనిమిది నుంచి పది మంది వచ్చారు. వారు వచ్చి నేరుగా ఆ ఇద్దరిపై దాడికి దిగారు.

ఆ తర్వాత సదరు మహిళను బలవంతంగా సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెను రేప్ చేశారు. చైబాసా ముఫసిల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తెక్రాహతు ఏరియాలోని ఎరోడ్రోమ్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదని పోలీసులు వివరించారు. 

Also Read: యూపీ ఆశ్ర‌మంలో మ‌హిళ‌పై గ్యాంగ్ రేప్.. 24 గంట‌ల్లో రెండో ఘ‌ట‌న

ఈ ఘటన గురించి తమకు సమాచారం తెలియగానే వెంటనే సదర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ దిలిప్ ఖాల్కో, ముఫసిల్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ పవన్ పాఠక్‌లు స్పాట్‌కు చేరుకున్నారు. నిందితుల కోసం గాలింపులు చేశారు. కానీ, ఎవరూ దొరకలేదు. సమీప గ్రామంలో అనుమానితులుగా కనిపించిన కొందరు యువకులను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి ఇంటరాగేషన్ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. పది మంది గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ అశుతోష్ శేఖర్ తెలిపారు. 

కేసు దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. బాధితురాలికి సదర్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అక్కడ సెక్యూరిటీని టైట్ చేసినట్టు పోలీసులు వివరించారు.

click me!