ముష్కరుల వార్నింగ్..4 రోజుల్లో 40 మంది పోలీసులు రిజైన్

By Nagaraju TFirst Published Sep 26, 2018, 4:19 PM IST
Highlights

ఉగ్రవాదుల బెదిరింపులు, హత్యలతో జమ్ముకశ్మీర్‌ వణుకుపోతుంది. విధులు నిర్వహిస్తున్న పోలీసులను ముష్కరులు అత్యంత కిరాతకంగా హతమారుస్తుండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 40 మందికి పైగా పోలీసులు తమ విధులకు రాజీనామా చేశారు.
 

శ్రీనగర్‌: ఉగ్రవాదుల బెదిరింపులు, హత్యలతో జమ్ముకశ్మీర్‌ వణుకుపోతుంది. విధులు నిర్వహిస్తున్న పోలీసులను ముష్కరులు అత్యంత కిరాతకంగా హతమారుస్తుండటంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు రోజుల్లో 40 మందికి పైగా పోలీసులు తమ విధులకు రాజీనామా చేశారు.

ఇటీవలే జమ్మూకశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్‌ జిల్లాలో పోలీసుల ఇళ్లల్లోకి చొరబడిన ముష్కరులు ముగ్గురు పోలీసులను అపహరించుకుపోయారు. వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. దీంతో పోలీసులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ముష్కరుుల తమ ఇండ్లలోకి చొరబడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు.

అయితే పోలీసులను హతమార్చేముందు ఉగ్రవాదులు పోలీసులను హెచ్చరించారు. విధులకు రాజీనామా చేయండి లేదంటే చచ్చిపోతారు అంటూ బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజులకే పోలీసులను హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల హెచ్చరికలతో చాలా మంది పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. గత శుక్రవారం నుంచి మంగళవారం వరకు 40 మందికి పైగా పోలీసులు రాజీనామా చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి చాలా భయంకరంగా ఉందని రిజైన్ చేసిన పోలీసులు వాపోతున్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని భద్రత గురించి నా కుటుంబం ఆందోళన పడుతోందని అందువల్లే రాజీనామా చేసినట్లు కానిస్టేబుల్ తెలిపారు. 

మరోవైపు పోలీసుల రాజీనామాలపై హోంశాఖ స్పందించింది. రిజైన్ చేసిన వాళ్లు అసలు ఎస్పీవోలే కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఎస్పీవోలు అయినా 40 మంది రాజీనామాల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో 30వేల మంది ఎస్పీవోలు ఉన్నారని వారితో పోల్చుకుంటే రాజీనామా చేసిన వారు చాలా తక్కువ అంటూ అభిప్రాయపడింది.  

అలాగే పోలీసుల రాజీనామాలను ఆపేందుకు హోంశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎస్పీవోల జీతాలను పెంచాలని భావిస్తుంది. ప్రస్తుతం 6 వేల రూపాయలు ఉన్న ఎస్పీవోల జీతాన్ని రూ.10 వేలకు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

అలాగే రాజీనామా వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు వీలు లేకుండా దక్షిణ కశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. అటు పోలీసుల భద్రతపై కూడా అధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే చాలా మంది పోలీసులను, వారి కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.

click me!