Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు ఐటీ షాక్.. 1000 కోట్ల ఆస్తులు సీజ్..

By team teluguFirst Published Nov 2, 2021, 1:19 PM IST
Highlights

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేతల అజిత్ పవర్‌కు (Ajit Pawar) సంబంధించిన ఆస్తులను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (IT Dept) సీజ్ చేసింది. బినామీ చట్టం కింద ఈ ఆస్తులను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేతల అజిత్ పవర్‌కు (Ajit Pawar) సంబంధించిన ఆస్తులను ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ (IT Dept) సీజ్ చేసింది. బినామీ చట్టం కింద ఈ ఆస్తులను సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో ఉన్న ఈ ఆస్తులు విలవ రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా. అజిత్‌ పవార్‌ సన్నిహితులతో ముడిపడి ఉన్న మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని విలువైన ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ తాత్కాలికంగా జప్తు చేసింది. వీటిలో సౌత్ ఢిల్లీలో రూ.20 కోట్లు విలువైన ఓ ఫ్లాట్, నిర్మల్ హౌస్‌లో ఉన్న పవార్ ఆఫీసు విలువ రూ.25 కోట్లు, జరందేశ్వర్‌లో రూ.600 కోట్ల విలువైన షుగర్ ఫ్యాక్టరీ, గోవాలో రూ.250 కోట్ల ఖరీదు చేసే రిసార్ట్‌లను బినామీ ఆస్తులుగా ఐటీ అధికారులు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ నేరుగా పవార్‌కు చెందినవి కావనీ, ఆయన సన్నిహితులకు ముడిపడి ఉన్నవేనని సమాచారం.

Also read: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అరెస్ట్

గతనెలలో ఆదాయపు పన్ను శాఖ (IT Dept) అధికారులు అజిత్ పవార్‌కు చెందిన కంపెనీలతో పాటు, ఆయన బంధువుల చెందిన సంస్థలపై దాడులు జరిపిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబైలోని రెండు రియల్ ఎస్టేట్ గ్రూపులపై,  అజిత్ పవార్ బంధువులతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలపై దాడి చేసిన తర్వాత 184 కోట్ల రూపాయల లెక్కలో చూపని ఆదాయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ముంబై, పూణే, బారామతి, గోవా మరియు జైపూర్‌లో విస్తరించి ఉన్న దాదాపు 70 చోట్ల అక్టోబరు 7న సోదాలు జరిగాయి. అజిత్ పవార్ కొడుకు, సోదరీమణులకు సంబంధం ఉన్న సంస్థలపై ఐటీ శాఖ దాడి చేసింది.

అయితే ఈ సందర్బంగా స్పందించిన అజిత్ పవార్.. తనకు సంబంధించిన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయితే తన ముగ్గురు సోదరిమణులను ఈ వ్యవహారంలోకి తీసుకురావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మేము ప్రతి సంవత్సరం పన్నులు చెల్లిస్తున్నాం. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను.. నాకు ఆర్థిక క్రమశిక్షణ గురించి తెలుసు. నాకు చెందిన అన్ని సంస్థలు పన్నులు చెల్లించాయి’ అని అజిత్ పవార్ అన్నారు. 

click me!