గగన్‌యాన్ మిషన్.. టీవీ-డీ1 ప్రయోగం విజయవంతం..

By Sumanth Kanukula  |  First Published Oct 21, 2023, 10:20 AM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌‌లో భాగంగా తలపెట్టిన టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతం  అయింది.


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌‌లో భాగంగా తలపెట్టిన టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతం  అయింది. ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఈ సన్నాహక పరీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయోగంలో భాగంగా.. క్రూ మాడ్యుల్, క్రూ ఎస్కేప్‌ విజయవంతంగా విడిపోయాయి. రాకెట్‌ భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్‌ విడిపోయింది. తర్వాత క్రూ మాడ్యుల్ సురక్షితంగా ప్యారాచూట్‌ సాయంతో బంగాళాఖాతంలో ల్యాండ్ అయింది. 

టీవీ-డీ1 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. గగన్‌యాన్ టీవీ-డీ1 మిషన్ విజయవంతమైందని ప్రకటిస్తున్నందుకు..  చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తొలుత సాంకేతిక లోపం రాగానే వెంటనే గుర్తించామని తెలిపారు. లోపం గుర్తించి వెంటనే సరిచేశామని చెప్పారు. క్రూ మాడ్యుల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని చెప్పారు. 

Latest Videos

ఇక, ఈ ప్రయోగాన్ని తొలుత శనివారం ఉదయం 8 గంటలకు ప్రయోగాన్ని చేపట్టాలని భావించిన.. వాతావరణం అనుకూలించక 8.45 గంటలకు రీషెడ్యూల్ చేశారు. అయితే ఆ తర్వాత ప్రయోగానికి 5 సెకన్ల ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో.. ప్రయోగాన్ని వాయిదా వేశారు. అయితే ప్రయోగాన్ని హోల్డ్‌లో ఉంచిన శాస్త్రవేత్తలు వెంటనే.. సాంకేతిక లోపాన్ని సరిచేసి ఉదయం10 గంటలకు ప్రయోగాన్ని చేపట్టారు. 

ఈ ప్రయోగం లక్ష్యం ఏమిటంటే..
గగన్‌యాన్‌కు ముందు ఇస్రో నాలుగు కీలక పరీక్షలు నిర్వహించాలని చూస్తోంది. అందులో టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ మొదటిది. అంతకుముందు 2018లో ఇలాంటి పరీక్ష నిర్వహించినప్పటికీ.. అది పరిమిత స్థాయిలోనే జరిగింది. ఈసారి దాదాపుగా పూర్తిస్థాయిలో సిద్ధమైన వ్యోమనౌకను పరీక్షించనున్నారు. ఇస్రో ప్రకారం, ఈ అబార్ట్ మిషన్ కోసం అభివృద్ధి చేసిన టెస్ట్ వాహనం సింగిల్-స్టేజ్ లిక్విడ్ రాకెట్. ఈ రాకెట్ పేలోడ్‌లలో క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లు, వాటి వేగవంతమైన సాలిడ్ మోటార్‌లతో పాటు క్రూ మాడ్యూల్ ఫెయిరింగ్, ఇంటర్‌ఫేస్ అడాప్టర్‌లు ఉన్నాయి. 

ఈ ప్రయోగంలో క్రూ మాడ్యుల్ పనితీరు, క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్దత, వ్యోమనౌకను కిందకు తీసుకొచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్టతను పరీక్షించాలనేది ఇస్రో లక్ష్యం.  వ్యోమగాములతో వెళ్లే రాకెట్‌లో ఏదైనా లోపం ఎదురైతే.. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడకుండా.. వారు ఉండే క్రూ మాడ్యుల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి తీసుకురావాలి. దీనినే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటారు. ఒక రకంగా ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటింది. 

click me!