Chandrayaan: ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ మిషన్ అంతిమ లక్ష్యం ఏమిటీ?.. జాబిల్లిపై జీవించొచ్చా?

By Mahesh K  |  First Published Jul 14, 2023, 3:34 PM IST

ఈ రోజు మధ్యాహ్నం శ్రీహరి కోట నుంచి ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించింది. ఈ సందర్భంగా ఇస్రో చేపడుతున్న చంద్రయాన్ అంతిమ లక్ష్యం ఏమిటో తెలుసుకుందాం. జాబిల్లిపై మనిషి నివసించడానికి గల అవకాశాలను అన్వేషించడమే ఈ మిషన్ లక్ష్యంగా ఉన్నది.
 


న్యూఢిల్లీ: ఇస్రో ఈ రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ప్రయోగం చేసింది. చంద్రయాన్ 2 నెరవేర్చలేకపోయిన లక్ష్యాన్నే చంద్రయాన్ 3 ద్వారా సాధించాలని ఇస్రో సంకల్పించింది. చంద్రయాన్ 1 మాత్రం  విజయవంతమైన సంగతి  తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై.. అనుకున్న ఫలితాలు సాధిస్తే.. తదుపరిగా చంద్రయాన్ 4, 5, 6 ప్రయోగాలకు లైన్ క్లియర్ అవుతుంది. ఇంతకీ చంద్రయాన్ మిషన్ లక్ష్యం ఏమిటీ? ఫైనల్ గోల్.. జాబిల్లిపై జీవించడమేనా? అంటే.. ఔననే చెప్పాలి.

భూగ్రహానికి వెలుపల మనిషి అడుగుపెట్టింది చంద్రుడిపైనే. భూ ఉపగ్రహమైన ఈ చంద్రుడి గురించి మిగిలిన గ్రహాల కంటే ఎక్కువ సమాచారం మన వద్ద ఉన్నది. మనకు ఉపగ్రహమైన చంద్రుడు ఇతర గ్రహాలతో పోల్చితే చాలా దగ్గరగా ఉంటుంది. గ్రావిటీ అక్కడ భూమితో పోల్చితే ఆరో వంతు మాత్రమే. అంటే.. 60 కిలోలు ఉన్న మనిషి చంద్రుడిపై 10 కిలోలు మాత్రమే ఉంటాడు.

Latest Videos

కాబట్టి, భూమికి ప్రత్యామ్నాయంగా మనిషి ఆవాసానికి ప్రయోగాలు చేయాలంటే ఇప్పటికైతే చంద్రుడు సరైన టార్గెట్. అమెరికా మార్స్ పై అడుగుపెట్టే ప్రయోగాలు చేస్తున్నది. అందుకోసం చంద్రుడిని ఒక హాల్టింగ్ పాయింట్‌గా మార్చుకునే ఆలోచనలను నాసా చేస్తున్నది. కానీ, ఇస్రో మాత్రం చంద్రుడిపై మనిషి జీవించడానికి గల అవకాశాలను అన్వేషించడమే లక్ష్యంగా చంద్రయాన్ మిషన్ ప్రారంభించింది.

చంద్రయాన్ 1 ప్రయోగాన్ని ఇస్రో 2008లో ప్రయోగించింది. అప్పుడు చంద్రుడి కక్ష్యంలోకి చంద్రయాన్ 1ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. అప్పుడు ఇంపాక్టర్‌ను చంద్రుడి మీద ప్రయోగించింది. చంద్రుడిపై ఖనిజాల సమాచారాన్ని అప్పుడు ఇస్రో కొంత వరకు సేకరించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్‌ 2ను ఇస్రో 2019లో ప్రయోగించింది. కానీ, అప్పుడు ఆర్బిటర్ అనుకున్నట్టుగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లింది. కానీ, ల్యాండర్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై బలంగా ఢీకొట్టుకోవడంతో ధ్వంసమైంది. ఫలితంగా రోవర్ కూడా పనిచేయలేదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఇది విఫలమైంది.

Also Read: చంద్రయాన్ - 3 ప్రయోగం విజయవంతం: ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు

ఇప్పుడు ఆ ల్యాండర్ సేఫ్‌గా ల్యాండ్ అయి.. రోవర్‌ను విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దించాలని చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించింది. రోవర్ జాబిల్లి ఉపరితలంపై తింపడమే ప్రస్తుతం ఇస్రో లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే.. మొత్తంగా చంద్రయాన్ మిషన్ ఫైనల్ గోల్ చూస్తే మాత్రం  చంద్రుడి పై మనిషి నివసించడానికి గల అవకాశాలను అన్వేషించడమే.

click me!