ఆ శాటిలైట్లు వినియోగించలేం.. ఎస్ఎస్ఎల్‌వీ మిషన్ విఫలం.. ప్రకటించిన ఇస్రో

By Mahesh KFirst Published Aug 7, 2022, 4:23 PM IST
Highlights

ఇస్రో ఈ రోజు పంపిన ప్రయోగించిన ఎస్ఎస్ఎల్‌వీ మిషన్ విఫలం అయింది. టర్మినల్ దశలో వీటీఎం సరిగా పనిచేయకపోవడంతో ఈ మిషన్ ఫెయిల్ అయినట్టు ఇస్రో వెల్లడించింది.
 

న్యూఢిల్లీ: ఈ రోజు ఇస్రో శ్రీహరికోట నుంచి సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్‌వీ) విఫలమైంది. ఈ లాంచ్ వెహికిల్‌లో రెండు పెద్ద శాటిలైట్లు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, ఆజాదిశాట్.. 750 మంది విద్యార్థినులు కలిసి అభివృద్ధి చేసిన క్యూబ్ శాట్ కూడా ఉన్నది. ఈ ఉపగ్రహాలను వినియోగించలేమని ఇస్రో ప్రకటించింది.

ఈ ఉపగ్రహాలను సరైన కక్ష్యలోకి పంపే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీటీఎం) ఈ మిషన్ విఫలం కావడానికి కారణంగా ఇస్రో ప్రకటించింది. టర్మినల్ స్టేజ్‌లో ఈ వీటీఎం అగ్గి పుట్టించలేదని తెలిపింది. ఈ వీటీఎం 30 సెకండ్ల పాటు మండాలని, కానీ, ఇది కేవలం ఒక సెకన్ మాత్రమే మండి మిన్నకుండిపోయిందని వివరించింది. 

అన్ని దశలూ సక్రమంగా జరిగాయని భారత అంతరిక్ష ఏజెన్సీ ఇస్రో తెలిపింది. అయితే డేటా మాత్రం కోల్పోయామని, ఈ మిషన్ ఫెయిల్ అయినట్టు తొలుత ప్రకటించింది.

ఈ ఎస్ఎస్ఎల్‌వీ- డీ1 శాటిలైట్లను 356 కిలోమీటర్ల కక్ష్యలోకి పంపాలని, కానీ, ఇది వృత్తాకార వలయంలో కాకుండా 356 కిలోమీటర్లు వర్సెస్ 76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి పంపినట్టు ఇస్రో వివరించింది. సమస్యను తాము కనిపెట్టినట్టు తెలిపింది.

స్థిరమైన కక్ష్యలోకి శాటిలైట్లను పంపకపోవడం అంటే వాటి ప్రదర్శనపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, కొన్నిసార్లు ఆ శాటిలైట్లు ఇతర శాటిలైట్లనూ ఢీకొట్టే ముప్పు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అవి తిరిగి భూ గ్రహంపైనా పడిపోయే ముప్పు ఉంటుంది. ఈ శాటిలైట్లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయే అవకాశం ఉన్నదని నిపుణులు వివరించారు.

ఎస్ఎస్ఎల్‌వీ కోసం భారత ప్రభుత్వం రూ. 169 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ లాంచ్ వెహికిల్స్ 500 కిలోల శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపగల సామర్థ్యం కలిగి ఉంటాయి.

click me!