
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 18 గంటల పాటు విచారించిన తర్వాత ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించిన మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ విడుదల చేసిన వీడియోలో.. సెంథిల్ బాలాజీని 18 గంటల పాటు నిర్బంధించడం, మానసికంగా, శారీరకంగా బలహీనపర్చడం వల్లే ఛాతీ నొప్పి వచ్చిందని సీఎం ఆరోపించారు. ప్రశ్నించడం, అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన అన్నారు. అయితే దర్యాప్తు చేయొద్దని తాను అనడం లేదని, కానీ ఉగ్రవాదిలా బంధించి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏముందని సీఎం ప్రశ్నించారు.
‘‘ఆయన పారిపోయే వ్యక్తి కాదు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆయనను నిర్బంధించారు. ఆయనను కలవడానికి ఎవరినీ అనుమతించలేదు. ఛాతిలో నొప్పి తీవ్రమవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పుడు కూడా వారు విముఖత చూపి ఉంటే తన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది’’ అని అన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మాత్రమే దాడులు జరుగుతున్నాయని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు దాడులు జరగడం లేదని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు.
‘‘దేశం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉందా? ఈడీ ద్వారా బీజేపీ తమ రాజకీయాలు చేయాలని చూస్తోంది. వారి రాజకీయం ప్రజావ్యతిరేకమం. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడం వీరి శైలి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఒకే స్క్రిప్ట్ ను డబ్బింగ్ చేస్తున్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాల్లో ఎలాంటి దాడులు జరగవు’’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.
ఉత్తరకాశీ మత ఉద్రిక్తత : పురోలాలో జరగని ‘మహాపంచాయత్’..కొనసాగుతున్న 144 సెక్షన్
పదేళ్లలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఈడీ మొత్తం 112 దాడులు మాత్రమే నిర్వహించిందని స్టాలిన్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుల సంఖ్య 3000కు చేరిందని, కానీ శిక్షల రేటు 0.05 శాతం మాత్రమే అని అన్నారు. నిందితులు బీజేపీలో చేరితే క్లీన్ అవుతున్నారని అన్నారు. ‘‘2016, 17, 18 సంవత్సరాల్లో అన్నాడీఎంకే మంత్రులను బానిసలుగా మార్చేందుకు బీజేపీ పలు దాడులు నిర్వహించింది. జయలలిత మరణానంతరం బీజేపీత సీబీఐ, ఐటీ, ఈడీలను ఉపయోగించుకుని అన్నాడీఎంకేను బానిసలుగా మార్చుకుంది. వారు కూడా ఒత్తిడికి తలొగ్గి కాళ్లపై పడిపోయారు. ఇప్పుడు సెంథిల్ బాలాజీపై ఈపీఎస్ ఫిర్యాదు చేస్తున్నారు. ఈపీలపై చాలా అవినీతి కేసులు ఉన్నాయి. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు’’ అని స్టాలిన్ అన్నారు.
కాగా.. సెంథిల్ బాలాజీ శాఖలను ఇతర మంత్రులకు బదిలీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసింది. గవర్నర్ కు చేసిన సిఫారసులో విద్యుత్ శాఖను అదనపు బాధ్యతగా ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసుకు కేటాయించాలని ప్రతిపాదించారు. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముత్తుస్వామికి అదనపు బాధ్యతలుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను అప్పగించాలని పేర్కొన్నారు.
అసలు సెంథిల్ బాలాజీపై వచ్చిన అభియోగాలేంటి?
2011 నుంచి 2015 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జాబ్ రాకెట్ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తం రూ.1.60 కోట్ల లెక్కల్లో చూపని నగదును బాలాజీ, ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ డబ్బు అతడి నిజమైన ఆదాయం నుండి వచ్చిందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఈడీ తెలిపింది. ప్రస్తుతం ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో విద్యుత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖకు బాలాజీ నేతృత్వం వహిస్తున్నారు.