వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షల ఎత్తివేత!.. కేంద్రం కీలక ప్రకటన

By telugu teamFirst Published Nov 24, 2021, 5:00 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ విమాన సేవలను సాధారణ స్థితికి తేవాలనే ఆలోచనలు చేస్తున్నట్టు వివరించింది. గతేడాది మార్చి నుంచి అమలవుతున్న ఆంక్షలు ఈ నెలాఖరుతో ముగియనున్న తరుణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన చేసింది. అంతేకాదు, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ అన్ని కూడా టాటా సన్స్‌కు ఏడాది చివరికల్లా అప్పజెప్పాలనీ నిర్ణయించినట్టు తెలిపింది.
 

న్యూఢిల్లీ: దేశంలో Corona కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజువారీ కేసులు పదివేలకు లోపే నమోదవుతున్నాయి. యాక్టివ్  కేసులూ భారీగా తగ్గుముఖం పట్టడంతో చాలా రంగాలు మళ్లీ సాధారణ పరిస్థితుల వైపు మళ్లుతున్నాయి. అయితే, అంతర్జాతీయంగా బీభత్సం సృష్టించిన కరోనా మహమ్మారి భయాలు పలుదేశాల్లో ఇంకా కొనసాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన ప్రయాణాల(Flight Services)పై ఆంక్షలు పొడిగిస్తూనే వస్తున్నది. ఈ నెలాఖరు వరకు ఆంక్షలను కేంద్రం పొడిగించింది. అయితే, ఈ సారి మళ్లీ ఆ ఆంక్షలను పొడిగించే అవకాశాలు స్వల్పంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖనే ఈ ఏడాది చివరి వరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మళ్లీ సాధారణ స్థితి(Normalcy)కి వస్తాయని భావిస్తున్నట్టు అభిప్రాయపడింది.

అంతర్జాతీయ విమాన ప్రయాణ సేవలను త్వరలోనే సాధారణ స్థితికి తేనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఈ సేవలు సాధారణ స్థితికి తెచ్చే యోచన చేస్తున్నట్టు వివరించారు. అంతేకాదు, మరో కీలక విషయాన్నీ ఆయన వెల్లడించారు. ఇదే ఏడాది చివరికల్లా ఎయిర్ ఇండియాకు చెందిన ఆపరేషన్‌లు అన్నింటినీ టాటా సన్స్‌కు అందించాలనే నిర్ణయమూ ఉన్నట్టు వివరించారు.

Also Read: విమాన సేవలపై ఆంక్షలు ఎత్తివేత.. దేశీయంగా ఫుల్ కెపాసిటీతో ప్రయాణించవచ్చు.. కేంద్రం కీలక నిర్ణయం

గతవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఇంకొన్ని దేశాల్లో కరోనా పరిస్థితులు గంభీరంగానే ఉన్నాయని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే అంతర్జాతీయ విమాన సేవలను పూర్వ స్థితికి తీసుకురావాలనే ఆలోచనలు జరుగుతున్నాయని వివరించారు. వీలైనంత త్వరగా అంతర్జాతీయ విమాన సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రక్రియ మొదలైనట్టు తెలిపారు.

గతేడాది మార్చిలో అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం విధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ ప్యాసింజర్ ఫ్లైట్స్‌పై ఆంక్షలు అమలవుతూ వస్తున్నది. ఇటీవలి కాలంలో నెల వ్యవధితో ఈ ఆంక్షలను పొడిగిస్తూ వస్తున్నది. నెలాఖరు వచ్చే సరికి మరో నెలపాటు ఈ ఆంక్షలను అమలు చేస్తూ సర్క్యూలర్ జారీ చేస్తున్నది. గత నెలలో జారీ చేసిన సర్క్యూలర్ ఈ నెలాఖరుతో ముగియనున్నది. దీంతో డిసెంబర్ నెలకు సంబంధించిన సర్క్యూలర్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన తెలిపింది. దీంతో వచ్చే నెల కోసం ఈ ఆంక్షల పొడిగింపు సర్క్యూలర్ వెలువడే అవకాశాలు దాదాపు శూన్యమనే తెలుస్తున్నది.

Also Read: 50ఏళ్ల మిస్టరీ.. ఫ్లైట్ హైజాక్ చేసి ఆకాశంలోనే మాయమైన ఆ వ్యక్తి వివరాలు ఇంకా రహస్యమే

గతేడాది మార్చిలో ప్యాసింజర్ విమానాలపై ఆంక్షలు అమలైనప్పటికీ అంతర్జాతీయ కార్గో విమానాలకు మినహాయింపు ఉన్నది. వీటితోపాటు డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకూ ఆంక్షల నుంచి మినహాయింపులు ఉన్నాయి. కాగా, భారత ప్రభుత్వం, కొన్ని దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఇలాంటి దేశాలకు కొన్ని నిబంధనలతో విమాన ప్రయాణాలు సాగుతున్నాయి. కానీ, తాజా ప్రకటనతో వచ్చే నెల నుంచి అంతర్జాతీయ విమాన సేవలు మళ్లీ యథాస్థితికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం పర్యాటకులు, ప్రయాణికులకే కాదు.. విమానరంగంలో పనిచేసిన వారందరికీ ఎంతో శుభవార్త అని తెలుస్తున్నది.

click me!