
ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ అవాక్కయ్యే ఘటన వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం ఓ విద్యార్థిని కిడ్నాప్ అయ్యింది. అయితే, ఆ అమ్మాయి కిడ్నాప్ విషయంలో వెలుగు చూసిన విషయం అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. నిజంగా ఆ యువతి కిడ్నాప్ కాలేదని.. డబ్బుల కోసం ఫేక్ డ్రామా ఆడిందని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు.
సదరు విద్యార్థిని పేరు హన్సికా వర్మ. ఆమె ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్ష పాస్ అయ్యింది. రూర్కీలోని ఇంజనీర్ కాలేజీకి అడ్మిషన్ కోసం హన్సిక వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఆమె కనిపించకుండా పోయింది. ఆ తరువాత ఆమె తండ్రి మొబైల్ ఫోన్ వాట్సాప్ కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఆ వీడియోలో హన్సికను ఎవరో తాళ్లతో కట్టేసినట్లుగా కనిపిస్తుంది.
ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎండోస్కోపీ గదిలో ఎగసిపడుతున్న మంటలు..
అది చూసిన హన్సిక తండ్రి షాక్ అయ్యాడు. వారు హన్సికను విడుదల చేయాలంటే రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు గాలింపు చేపట్టిన పోలీసులు.. కిడ్నాప్ డ్రామాను ఛేదించారు. అసలు అది కిడ్నాపే కాదని డబ్బుల కోసం కూతురే నాటకం ఆడిందని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
పోలీసుల దర్యాప్తులో హన్సిక ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని.. అతడిని రహస్యంగా పెళ్లి చేసుకోవడం కోసమే ఈ కిడ్నాప్ డ్రామా ఆడిందని తేలింది. పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో ప్రేమికులు ఇద్దరు కలిసి ఫేక్ కిడ్నాప్ డ్రామాకు తెరలేపారు. దాని ప్రకారమే ఒక బెదిరింపు వీడియోను హన్సిక తన తండ్రికి పంపించింది. డబ్బులు డిమాండ్ చేయించింది.
ఆ తరువాత మరో షాకింగ్ విషయం తెలిసింది. హన్సిక, ఆమె ప్రియుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. కాన్పూర్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆనంద్ ప్రకాష్ తివారి ఆధ్వర్యంలో పోలీసు బృందం హన్సికను, ఆమె ప్రియుడు రాజ్ సింగును అరెస్టు చేశారు. ఆ సమయంలోనే వారి దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ పోలీసులకు దొరికింది. వారిద్దరూ మే 22వ తేదీనే వివాహం చేసుకున్నారు. దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని తెలిసింది.
దీంతో పోలీసులు ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేయగా వారిద్దరికీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిందని తెలిసింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసి.. పెళ్లివరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అయితే, పోలీసులకు మరో అనుమానం కూడా ఉంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ నిజమైందో, కాదో అనే డౌట్ తో.. దాన్ని తేల్చే పనిలో పోలీసులు పడ్డారు.