యువతలో నైరాశ్యం.. భారత్ ఎదుర్కొంటున్న సమస్య: వరల్డ్ ఎకనామిక్ ఫోరం

By Mahesh KFirst Published Jan 12, 2022, 3:00 AM IST
Highlights

భారత్‌లో యువత నైరాశ్యంలో కూరుకుపోయిందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగంగా పురోగమించడానికి, పుంజుకోవడానికి ప్రధాన ముప్పుగా ఉన్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. తాజాగా, ఆ సంస్థ గ్లోబల్ రిస్క్ రిపోర్టును వెల్లడించింది. ఇందులో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించింది. మన దేశంలో కరోనా మహమ్మారి కాలంలో అంటే రెండేళ్ల నుంచి డిజిటల్ ప్రాపెసింగ్‌పై ఆధారం పెరిగిందని, దీనితోపాటే సైబర్ సెక్యూరిటీ సమస్యలు పెరిగాయని ఆ రిపోర్టు వెల్లడించింది. 
 

న్యూఢిల్లీ: ప్రపంచ ప్రసిద్ధ ప్రభుత్వేతర, లాబీయింగ్ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum) గ్లోబల్ రిస్క్ రిపోర్ట్(Global Risk Report) 2022 విడుదల చేసింది. వచ్చే వారంలో ఆన్‌లైన్ దావోస్‌ అజెండా(Davos Agenda) సమావేశం నిర్వహించనున్న తరుణంలో ఈ రిపోర్టు వెల్లడించింది. ఇందులో భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఏకరువు పెట్టింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలు అనూహ్య పరిణామాలను చవిచూస్తున్నాయి. ఈ కాలంలో డిజిటల్ ప్రాసెస్‌లపై ఆధారపడటం పెరిగింది. మన దేశంలో దీనితోపాటే సైబర్ సెక్యూరిటీ (Cybfer Security) సమస్యలు పెరిగాయని ఆ రిపోర్టు వెల్లడించింది. ఇదే సమయంలో యువతలో నైరాశ్యం (Dissillusionment in Youth) కూడా పెరిగిందని వివరించింది. డిజిటల్ ఇనిక్వాలిటీ, రాష్ట్రాల మధ్య తెగిన సంబంధాలు ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉన్నాయని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పు సంబంధ సమస్యనే ప్రధానంగా ఉన్నదని ఈ రిపోర్టు వెల్లడించింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రభావం వేసే సమస్యగా ఇది ఉన్నదని తెలిపింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పది ప్రధాన సమస్యల్లో ఐదు.. ఈ పర్యావరణ మార్పు చుట్టూ అల్లుకుని ఉన్నాయని పేర్కొంది. పర్యావరణ మార్పులు, పెరుగుతున్న సామాజిక అంతరాలు, సైబర్ రిస్క్‌లు పరాకాష్టకు చేరుతుండటం, మహమ్మారి దెబ్బ నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడంలో వ్యత్యాసాలు వంటివి ప్రపంచవ్యాప్తంగా స్థూలంగా ఉన్న ప్రధాన సమస్యలు అని ఆ రిపోర్టు తెలిపింది. వచ్చే మరికొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థల వృద్ధి, ఈ మహమ్మారి నుంచి ఆర్థికంగా నిలదొక్కుకోవడమూ సమానంగా సాగదని వివరించింది. భవిష్యత్‌లోనూ ఆర్థిక వ్యవస్థలు బలహీనంగానే కొంత కాలం కొనసాగుతాయని తెలిపింది.

కాగా, భారత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రిపోర్టు చర్చించింది. రాష్ట్రాల మధ్య సంబంధాలు బలహీనపడటం, పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రుణ సంక్షోభాలు, యువతలో నిరాశా భావం, టెక్నాలజి గవర్నెన్స్ వైఫల్యం, డిజిటల్ ఇనిక్వాలిటీలు ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ఐదు ప్రధాన సమస్యలు అని వివరించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ ఒపీనియన్ సర్వే ఈ సమస్యలను అంచనా వేసింది. సామాజిక అంతరాలు, ఉపాధి సంక్షోభంలో పడిపోవడం, మానసిక ఆరోగ్యం క్షీణించడం వంటి ముప్పులతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత సులువుగా రికవరీ అయ్యే చాన్స్ తక్కువ అని డబ్ల్యూఈఎఫ్ వివరించింది. అంతేకాదు, దేశాల మధ్య నెలకొంటున్న ఉద్రిక్తతలు వాటి ఆర్థిక వ్యవస్థలు, ఆయా దేశాలు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలపై ప్రభావం వేస్తున్నాయని తెలిపింది. ఉదాహరణకు కరోనా మహమ్మారి కాలంలోనే భారత్, జపాన్‌లు ప్రొటెక్షనిస్ట్ పాలసీలను అమలు చేయడం ప్రారంభించాయని వివరించింది.

2070 నాటికి శూన్య ఉద్గారాల లక్ష్యాన్ని భారత్ ప్రభుత్వం నిర్ణయించుకుందని, 2030 కల్లా పునరుత్పాదక శక్తిని 50 శాతం తయారు చేసుకోవడానికి టార్గెట్ పెట్టుకున్నట్టూ గుర్తు చేసింది. కలుషిత ఉద్గారాలు వెలువరించే అన్ని దేశాలూ క్రమంగా శిలాజ ఇంధనాలను వదిలిపెట్టాలని అంగీకరించాయని వివరించింది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలపై తమదైన అభిప్రాయాన్ని ఈ రిపోర్టులో పొందుపరించింది.

click me!