Omicron: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుతున్నాయి. కొత్తగా మరో 13 ఒమిక్రాన్ కేసులు నమోదుకావడంతో దేశంలో వీటి సంఖ్య 213కు పెరిగింది. అత్యధికం మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే సగం కేసులు వెలుగుచూశాయి.
Omicron: దేశంలో కరోనా మహమ్మారి భయాందోనలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ రకం కేసులు డబుల్ సెంచరీ దాటాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా మరో 13 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వేరియంట్ మొత్తం కేసులు 213కు పెరిగాయి. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్ర, ఢిల్లీలోనే వెలుగుచూశాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు అత్యధికం దేశరాజధాని ఢిల్లీలోనే 57 కేసులు నమోదయ్యాయి. రెండు స్థానంలో ఉన్న మహారాష్ట్ర 54 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీలో 57, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో 2, ఒడిశాలో 2, ఉత్తరప్రదేశ్ లో 2, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, లద్దాఖ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంది. దేశంలో కొత్త వేరియంట్ సోకిన వారిలో ఇప్పటివరకు 90 మంది కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
Also Read: Karnataka: టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
undefined
ఇదిలావుండగా, కరోనా వైరస్ దేశంలో మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 6,317 మందికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,58,481 కి చేరింది. ఇదే సమయంలో కొత్తగా 6,906 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,42,01,966కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 78,190 యాక్టివ్ కేసులున్నాయి. అలాగే, గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 318 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 4,78,325కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. మరణాల రేటు 1.35 శాతంగా ఉంది. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ తో పాటు, కరోనా పరీక్షలు అధికంగా నిర్వహిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 66,61,26,659 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్క రోజే 10,14,079 కోవిడ్-19 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది. కరోనా టీకాల పంపిణీలోనూ వేగం పెంచారు. ఇప్పటివరకు మొత్తం 139 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. ఇందులో 83 కోట్ల మందికి మొదటి డోసు తీసుకోగా, రెండు డోసులు తీసుకున్నవారు 56 కోట్ల మంది ఉన్నారు.
Also Read: అంగన్‌వాడీలకు అత్యధిక వేతనాలు తెలంగాణలోనే : మంత్రి సత్యవతి రాథోడ్
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఈ రకం కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అక్కడ పరిస్థితులు దారుణంగా మారుతుండటంలో ప్రపంచ దేశాలు సైతం కొత్త వేరియంట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం నమోదుకావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలో కొత్త వేరియంట్ కేసులు 200లకు పైగా చేరాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పలు సూచనలతో హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఇదివరకు కల్లోలం సృష్టించిన కరోనా వైరస్ డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ ప్రభావం వివిధ ప్రాంతాల్లో ఉందని పేర్కొంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని తెలిపింది. దీని కోసం స్థానిక ఆంక్షలు విధించాలని సూచించింది. ముందస్తు చర్యల్లో భాగంగా వార్ రూమ్ లను ఏర్పాటు, కోవిడ్ కేర్, ఐసోలేషన్ సెంటర్లను యాక్టివ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.
Also Read: Rahul Gandhi: మోడీ సర్కారు ఏర్పడ్డాకే మూకదాడులు.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్