1947లో అక్షరాస్యత ఎంత? ఇప్పటి వరకు లిటరసీ రేటు తీరు ఎలా ఉన్నది?

By Mahesh KFirst Published Aug 8, 2022, 6:12 PM IST
Highlights

స్వాతంత్ర్యం పొందినప్పుడు మన దేశంలో ప్రతి ఐదుగురిలో నలుగురికి అక్షరం ముక్క రాదు. కానీ, నేడు భారత అక్షరాస్యత 75 శాతానికి పెరిగింది. అంటే ప్రతి నలుగురిలో ముగ్గురికి రాయడం, చదవడం వచ్చు. ఇంకా సాధించాల్సింది ఉన్నప్పటికీ.. అప్పటితో పోలిస్తే గణనీయమైన పురోగతిని స్వతంత్ర భారతం సాధించింది.
 

న్యూఢిల్లీ: ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే అక్షరాస్యత పునాది వంటిది. అక్షరాస్యతతోనే అభ్యుదయం సాధ్యం. దానితోనే సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు చెక్ పెట్టగలం. సాంఘిక సంస్కరణ లేనిదే.. రాజకీయ సంస్కరణ కాజాలదని అంబేడ్కర్ చెప్పాడు. సాంఘిక సంస్కరణకు విద్య అత్యావశ్యకం. కాబట్టి, భారత దేశంలో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్షరాస్యత శాతం తీరు ఎలా ఉన్నది? స్వాతంత్ర్యం పొందినప్పుడు మన దేశంలో చదువుకున్నవారి శాతం ఎంత? ఇప్పుడు లిటరసీ రేటు ఎంత ఉన్నది? వంటి అంశాలను చూద్దాం.

భారత దేశం స్వాతంత్ర్యం పొందినప్పడు దేశ పౌరుల్లో చాలా మంది నిరక్షరాస్యులే. ప్రతి ఐదుగురిలో నలుగురికి రాయడం రాదు. అంటే అక్షరాస్యత సుమారు 20 శాతం ఉన్నది. కానీ, నేడు ప్రభుత్వం తీసుకున్న అనేక మంచి నిర్ణయాలతో అక్షరాస్యత పెరిగింది. ఇప్పుడు దేశంలో అక్షరాస్యత శాతం సుమారు 75 శాతానికి పెరిగింది.

1951 నుంచి చూసుకుంటే భారత అక్షరాస్యత రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 1951లో అక్షరాస్యత సుమారు 18.33 శాతం ఉన్నది. అదే 1961లో ఇది 28.3 శాతానికి, 1971లో 34.45 శాతంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే 1981లో ఈ అక్షరాస్యత రేటు 43.57కు, 1991లో 52.21కి, 2001లో 65.38 కి పెరిగింది. అంటే.. 1951 నుంచి అక్షరాస్యత రేటు క్రమంగా పెరుగుతుండటాన్నే మనం చూడవచ్చు. ఇప్పుడు మన దేశంలో 75 శాతం అక్షరాస్యత ఉన్నప్పటికీ మరెంతో సాధించాల్సి ఉన్నదనే విషయాన్ని మరిచిపోవద్దు.

ఎందుకంటే. అక్షరాస్యత రేటుతో పాటు మన దేశంలో జనాభా కూడా గణనీయంగా పెరుగుతున్నది. 1881 నుంచి అక్షరాస్యత రేటు, జనాభా పెరుగుదలను పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థం అవుతున్నది. ప్రతి దశాబ్దంలో అక్షరాస్యత పెరుగుతున్నది. కానీ, జనాభా కూడా అంతకంటే పెరుగుతున్నది. ఫలితంగా నిరక్షరాస్యుల సంఖ్యనే పెరుగుతున్నట్టు గమనించవచ్చు. కానీ, ఈ ధోరణిని 2001-2011 దశాబ్దం మార్చింది. ఈ దశాబ్దంలో పెరిగిన జనాభాతో పోల్చినప్పటికీ అక్షరాస్యుల సంఖ్య పెరగడం సంతోషదాయకం.

అక్షరాస్యత రేటు పెరగడంతోపాటు మరికొన్ని కీలక అంశాల్లో పురోగతి కనిపిస్తుంది. అందుకే సామాజిక ప్రగతికి అక్షరాస్యత చక్రాల వంటిది. పెరిగిన అక్షరాస్యతతో జీవిత ఆయుష్షు పెరగడం, శిశు మరణాల రేటు తగ్గడం, మహిళా సాధికారత, లింగ సమానత్వం వంటివీ మనం చూడొచ్చు.

click me!