శరణు కోరి వస్తే శతృవునైనా భారతీయులు కాపాడతారనేది మరోసాారి రుజువయ్యింది. ప్రాణాలు కాపాడుకునేందుకు భారత్ కు వచ్చిన పాకిస్థానీ మహిళలు పైసా ఖర్చులేకుండా ఏకంగా గుండెమార్పిడి శస్త్రచికిత్స చేసారు మన వైద్యులు....
శతృవునైనా ప్రేమగా చూసుకునే సంస్కృతి భారతీయులది. చేతులు చాచి సాయం కోరితే మన చెడును కోరుకునే దేశాలకు సైతం సాయం చేస్తుంది భారత్. అలాంటి ఓ ఆడబిడ్డ సాయంకోరి వస్తే చేయలేమా... ఆమె ప్రాణాలు కాపాడి మానవత్వం ప్రదర్శించాం. ఇలా పాకిస్థాన్ నుండి ప్రాణాలు అరచేత పట్టుకుని వచ్చిన మహిళను భారత వైద్యులు అభయం ఇచ్చారు... ఆమె ప్రాణాలు కాపాడారు.
వివరాల్లోకి వెళితే... అయేషా రషన్ అనే 19ఏళ్ల పాకిస్థానీ అమ్మాయి గత ఐదేళ్లుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీంతో 2019లో ఆమె వైద్యం కోసం ఇండియాకు వచ్చింది. ఆమె తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన సీనియర్ కార్డియక్ సర్జన్ డాక్టర్ కెఆర్ బాలకృష్ణన్ గుండె మార్పిడి చేయాలని సూచించారు.
అయితే గుండె మార్పిడి శస్త్రచికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. అంత డబ్బు అయేషా తల్లిదండ్రుల వద్ద లేకపోవడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేర్చారు. వీరి బాధను అర్ధం చేసుకున్న డాక్టర్లు మెడికల్ ట్రస్ట్ ద్వారా వైద్యం అందించడానికి సిద్దమయ్యారు. కానీ ఆమెకు సరిపోయే గుండె కోసం ఎదురుచూసారు. ఈ ఏడాది ఆరంభంలో 69 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అవ్వడంతో అతడి గుండె ఆయేషాకు సరిపోతుందని డాక్టర్లు తేల్చారు. దీంతో ఆమెకు ఆపరేషన్ చేసి గుండెను అమర్చారు. అయేషా సర్జరీకీ రూ.33 లక్షలు ఖర్చు అయ్యిందని... ఆ మొత్తాన్ని మెడికల్ ట్రస్ట్ భరించిందని డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం పాకిస్థానీ యువతి కోలుకుంటోంది. ఇప్పుడు తాను సులభంగా శ్వాస తీసుకోగలుగుతున్నానని... గుండెలో నొప్పి తగ్గిందని ఆయేషా తెలిపింది. పూర్తిగా కోలుకున్నాక తమ దేశం పాకిస్థాన్ వెళతానని... చదువు పూర్తిచేసి ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభిస్తానని అయేషా ఆనందంగా తెలిపింది.
కూతురు ప్రాణాలు కాపాడిన వైద్యులకు ఆయేషా తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెబుతున్నారు. తమ బిడ్డ గుండెనొప్పితో బాధపడటం చూసి తట్టుకోలేకపోయేవారిమని... భారత్ లో మంచి వైద్యం అందుతుందని వచ్చామన్నారు. అయితే పూర్తిగా గుండెను మార్చాలని డాక్టర్లు చెప్పారని... ఆ సర్జరీ కోసం తమవద్ద డబ్బులు కూడా లేవని అన్నారు. కానీ మానవత్వం కలిగిన డాక్టర్లు తమపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండానే ఆపరేషన్ చేసారని ఆయేషా తల్లి సనోబేర్ రషన్ భావోద్వేగానికి గురయ్యారు.