
Mann ki Baat: భారతదేశంలో 'యునికార్న్' కంపెనీల సంఖ్య 100కి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తెలిపారు, కోవిడ్-19 సమయంలో కూడా భారతదేశంలో (Indian Start-ups) స్టార్టప్‌లు సంపదను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మే 29, 2022) తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ (Mann ki Baat) 89వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు.
'మన్ కీ బాత్' ప్రేక్షకులను తమ ప్రాంతంలో పని చేస్తున్న మహిళా స్వయం సహాయక బృందాల గురించి తెలుసుకోవాలని, వారు తయారు చేసిన ఉత్పత్తుల గురించి సమాచారాన్ని సేకరించి, ఈ ఉత్పత్తులను వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలని ప్రధాని మోదీ కోరారు. ఈ సమయంలో తమిళనాడులోని తంజావూరు మహిళా సాధికారత స్పూర్తిదాయకమైన కథను శ్రోతలతో పంచుకున్నారు. దీనికి GI ట్యాగ్ కూడా ఉందని చెప్పాడు.
భారతదేశంలోని వైవిధ్యం గురించి మాట్లాడుతూ.. భారత దేశం అనేక భాషలు, లిపిలు, మాండలికాలకు గొప్ప నిధి ఉందనీ. వివిధ ప్రాంతాలు విభిన్న దుస్తులు, ఆహారం, సంస్కృతికి గుర్తింపు అని ప్రధాని అన్నారు. ఈ వైవిధ్యమే మనల్ని కలిసి ముందుకు నడవడానికి ఉపయోగపడుతోందని అన్నారాయన.
స్టార్టప్‌లలో భారతదేశం సాధించిన విజయాన్ని కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఇప్పుడు భారత దేశం.. 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 100 యునికార్న్‌లకు నిలయమని ప్రశంసించారు. యునికార్న్ కంపెనీ అంటే కనిష్టంగా రూ.7,500 కోట్ల టర్నోవర్ ఉన్న(Indian Start-ups) స్టార్టప్. ఈ యునికార్న్‌ల మొత్తం విలువ 330 బిలియన్ డాలర్లు, అంటే రూ. 25 లక్షల కోట్లు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మొత్తం యూనికార్న్ కంపెనీల్లో 44 యునికార్న్‌లు గత ఏడాది మాత్రమే స్థాపించబడ్డాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారని మోదీ అన్నారు. దీంతోపాటు ఈ ఏడాది మూడు, నాలుగు నెలల వ్యవధిలో 14 యూనికార్న్ కంపెనీలను ఏర్పాటు చేశారనీ. దీని అర్థం ప్రపంచ మహమ్మారి నేపథ్యంలో కూడా.. మన దేశ స్టార్టప్‌లు విజయవంతంగా ఉత్పత్తిని కొనసాగించాయని తెలిపారు.
భారతీయ యునికార్న్‌ల సగటు వార్షిక వృద్ధి రేటు US, UK అనేక ఇతర దేశాల కంటే ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. భారత దేశ యునికార్న్ కంపెనీలు విభిన్నతను సంతరించుకుంటున్నాయని, స్టార్టప్ ప్రపంచంలో న్యూ ఇండియా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందనీ, చిన్న పట్టణాలు, నగరాల ప్రజలు వ్యవస్థాపకులుగా మారుతున్నారని ప్రసంశించారు. ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రైవేట్ స్టార్టప్‌లను 'యూనికార్న్' కంపెనీలుగా పిలుస్తారు. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంటున్నారు.
స్టార్టప్‌ల ప్రపంచం నూతన భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని, నేడు, భారతదేశ స్టార్టప్ వ్యవస్థ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదని, చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించిందని తెలిపారు. భారతదేశంలో వినూత్న ఆలోచన ఉన్న వ్యక్తులు సంపదను సృష్టించగలరని ఆయన అన్నారు.
ఒక మంచి మెంటర్ స్టార్టప్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్ళగలడనీ, సరియైన నిర్ణయం వైపు వ్యవస్థాపకులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేయగలడని, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి తమను తాము అంకితం చేసుకున్న అనేకమంది మెంటార్‌లు భారతదేశంలో ఉన్నందుకు తాను గర్విస్తున్నానని చెప్పాడు.
ఈ సందర్భంగా.. ఇటీవల కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కల్పనా ప్రయాణాన్ని ప్రధాని మోదీ వివరించారు. మండుతున్న వేసవిలో పక్షులు, ఇతర జంతువులకు నీటి కుండలను. ఆహారం అందించాలని మన్ కీ బాత్ ప్రేక్షకులను PM కోరారు. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 8వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' జరుపుకోనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏడాది 'యోగా డే' థీమ్ - యోగా ఫర్ హ్యుమానిటీ. 'యోగా డే'ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని, అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.