
Elephant viral news: సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని హృదయాన్ని కలిచివేస్తాయి. ఈ ఫోటో చూస్తే.. జంతువులకు కూడా మనుషులతో సమానమైన భావాలు, భావోద్వేగాలు ఉంటాయని, అవి కూడా మనలాగే భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయని మరోసారి నిరూపితమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లో లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రతి ఒక్క మానవ హృదయాన్ని కదిలిస్తుంది. ఓ ఏనుగు.. తన చనిపోయిన పిల్లను తన తొండంతో పట్టుకుని కన్నీటి పర్యంతమవుతూ.. ఒక తోట నుంచి మరోక తోటకు ఇలా.. దాదాపు 7 కిలో మీటర్లు ప్రయాణించింది. ఈ దృశ్యం అందరిని కలిచివేస్తుంది.
శుక్రవారం అందిన సమాచారం ప్రకారం.. 30-35 ఏనుగుల గుంపు చనిపోయిన దూడను ఎత్తుకుని 7 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓ ఏనుగుల గుంపు ఒక తోట నుంచి మరో తోటకు కనీసం 7 కి.మీ దూరం ప్రయాణించి ప్రజలను భయాందోళనకు గురిచేశాయని.. ఒక్కసారిగా చాలా ఏనుగులను చూసి ప్రజలు భయపడుతున్నారని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలోని చునాభతి టీ తోటలో ఓ ఏనుగుపిల్ల చనిపోయింది. చనిపోయిన ఆ ఏనుగు పిల్లను తన తల్లి తొండంతో పట్టుకుని తన మందతో కలిసి ఒక తేయాకు తోట నుంచి మరో తేయాకు తోటకు వెళ్తుందని అటవీ అధికారులు తెలిపారు.
ఆ ఏనుగుల గుంపు.. మొదట చునాభటి నుండి అంబారీ టీ గార్డెన్, డయానా టీ గార్డెన్, నుడువార్స్ టీ గార్డెన్‌లకు వెళ్లి రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని పొద దగ్గర పిల్ల మృతదేహాన్ని ఉంచింది. ప్రస్తుతం ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ ఘటన హృదయాన్ని కలిచివేస్తున్న అంతా భారీ మొత్తంలో ఏనుగుల గుంపు స్థానిక టీ తోటల్లో తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.