ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి

By telugu teamFirst Published Aug 18, 2021, 6:37 PM IST
Highlights

కాబూల్‌లోని భారత ఎంబసీ ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో కనీసం 130 మంది సిబ్బంది, పౌరులను విజయవంతంగా ఎయిర్‌పోర్టుకు తరలించింది. ఇందుకోసం 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించుకుంది. నమ్మకస్తులైన మిలిటరీ అధికారుల సహాయం తీసుకుని తాలిబాన్ల కళ్లుగప్పి ఆపరేషన్ సక్సెస్‌గా చేపట్టింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ ఆపరేషన్‌ పర్యవేక్షించారు.
 

న్యూఢిల్లీ: రోజుల వ్యవధిలోనే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. విదేశీ రాయబారులు ఉండే కాబూల్ రాజధానినీ అతివేగంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి సిద్ధమవని దేశాలు తమ దౌత్య అధికారులు, పౌరులను స్వదేశాలకు తీసుకెళ్లడానికి తంటాలు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత పౌరులు, దౌత్య సిబ్బంది మొత్తం సుమారు 130 మందిని అక్కడి నుంచి విజయవంతంగా తరలించగలిగింది. ఇందుకోసం ఓ సీక్రెట్ ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టింది. ఉపగ్రహ చిత్రాలు ఈ ఆపరేషన్ తీరుతెన్నులను వెల్లడించాయి.

కాబూల్ రాజధానిని తాలిబాన్లు ఆదివారం(ఆగస్టు 15) నాడు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. నగరంలోని హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్టులో గలాట మొదలైంది. ఆప్ఘనిస్తాన్ పౌరులు పోటెత్తి విదేశాలకు వెల్లడానికి తీవ్రప్రయాస పడుతున్నారు. నగరాన్ని తాలిబన్లు చుట్టుముట్టిన ఈ తరుణంలో భారత దౌత్య సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించింది. 

స్వదేశానికి తిరిగి రావాలనుకున్న భారతీయులందరినీ ఎంబసీ కాంటాక్ట్ అయింది. వారంతా ఎంబసీ మిషన్‌కు ఆగస్టు 16వ తేదీ రాత్రిలోగా చేరుకోవాలని ఆదేశించింది. భారత ఎంబసీ కార్యాలయం నుంచి ఎయిర్‌పోర్టు ఏడు కిలోమీటర్లు. కానీ, ఈ ఏడు కిలోమీటర్లు తాలిబాన్ల కంటబడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా దౌత్యసిబ్బంది, భారత పౌరులు విమానాశ్రయం చేరుకోవాలి. ఈ క్రమంలో ఏ అవాంఛనీయ ఘటనైనా జరగవచ్చు. ప్రభుత్వమే కూలిపోవడంతో సహాయం తీసుకోవడానికి స్థానిక అధికారులెవరూ లేరు. దీంతో సొంతబలాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. నమ్మకస్తులైన కొంతమంది మిలిటరీ సహాయాన్ని తీసుకుంది. కనీసం 14 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సంపాదించుకోగలిగింది. ఈ వాహనాలను నాలుగు పైలట్ వాహనాలు వెనుకా ముందు ఉండేలా చూసుకుంది. ఈ పైలట్ వాహనదారులు స్థానిక భాష మాట్లాడగలిగే స్థానికులతో కలిసిపోయే వారిని ఎంచుకుంది. ఎయిర్‌పోర్టుకు ప్రయాణించే క్రమంలో అవాంతరాలు ఎదురైతే మాట్లాడి పరిష్కరించుకునే లక్ష్యంతో వీరిని నియమించుకుంది. 17వ తేదీ తెల్లవారుజామునే భారత ఎంబసీ అధికారులు, పౌరులు ఎయిర్‌పోర్టుకు ఆ కాన్వాయ్‌లో వెళ్లిపోయింది.

శాటిలైట్ చిత్రాలు వీటిని ధ్రువపరిచాయి. ఆగస్టు 16వ తేదీ సాయంత్రం ఎంబసీ కాంపౌండ్‌లో వరుసగా నిలిపిన 14 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కనిపించాయి. కానీ, మరుసటి రోజు సూర్యుని వెలుగులో అవి కనిపించలేవు. తాలిబాన్లు హఠాత్తుగా విధించిన రాత్రికర్ఫ్యూ కారణంగా 16వ తేదీ రాత్రి ఎంబసీ అధికారులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు సమాచారం.

ఈ ప్రయాణం గురించి వేరే ఎవరికీ సమాచారాన్ని తెలియనివ్వలేదు. ఈ తరలింపును న్యూయార్క్‌కు వెళ్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యవేక్షించారు. కాబూల్‌లోని ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తున్న అమెరికా సిబ్బందికి భారత దౌత్య అధికారులు ముందస్తుగానే సమాచారం అందించారు. ఎయిర్‌పోర్టుకు ఈ కాన్వాయ్ విజయవంతంగా చేరుకుందని సంబంధితవర్గాలు వెల్లడించాయి. అక్కడి నుంచి వారు క్షేమంగా భారత్ చేరుకున్నారు.

click me!