
అమెరికాలోని న్యూజెర్సీ లో ప్రవాస భారతీయ సమాజం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA NY-NJ-CT-NE), న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్, ప్రముఖ టెక్ సంస్థ జోహో కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదైంది. ‘లార్జెస్ట్ ఫ్లాగ్‌పోల్ నంబర్’ విభాగంలో ఈ ప్రపంచ రికార్డు అధికారికంగా నమోదైంది.
ఆగస్టు 15 శనివారం సాయంత్రం న్యూజెర్సీలోని పార్సిప్పానీ పరిధిలోని వెటరన్స్ మెమోరియల్ పార్క్‌లో ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో మొత్తం 1,383 అమెరికా జెండాల స్తంభాలను ప్రత్యేకంగా అమర్చి భారీ సంఖ్య ‘250’ ఆకారాన్ని రూపొందించారు. దీని చుట్టూ భారత త్రివర్ణ పతాకాలను వలయాకారంలో ఏర్పాటు చేశారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం (India@80), అమెరికా 250వ వార్షికోత్సవాన్ని (America@250) పురస్కరించుకుని ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పూర్తి పరిశీలన అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధి ఎఫ్‌ఐఏ నాయకులకు, ప్రముఖులకు రికార్డు పత్రాన్ని అందజేశారు.
ఈ రికార్డు పై ఎఫ్‌ఐఏ చైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడారు. భారత సమాజం చూపించిన అంకితభావానికి, సాంస్కృతిక గర్వానికి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిదర్శనమని పేర్కొన్నారు. ఒకే లక్ష్యంతో ఐక్యంగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని ఆయన చెప్పారు.
న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ అంబాసిడర్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ, ఈ మైలురాయి భారత్-అమెరికా వ్యూహాత్మక స్నేహానికి శక్తివంతమైన నిదర్శనమని తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాలను ఏకం చేయడంలో ఇండో-అమెరికన్ డయాస్పోరా కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. పార్సిప్పానీ మేయర్ పుల్కిత్ దేశాయ్ ప్రసంగిస్తూ, రెండు దేశాలు తమ భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటున్నాయని స్పష్టం చేశారు.
ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్ల కృషిని న్యూజెర్సీ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ డేల్ జి. కాల్డ్‌వెల్ అభినందించారు. సమాజ సేవ, సాంస్కృతిక కార్యక్రమాల్లో వాలంటీరిజాన్ని మరింతగా కొనసాగించాలని సూచించారు.
ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, చరిత్రను తిరగరాయడానికి తెరవెనుక అలుపెరగక శ్రమించిన ప్రతి వాలంటీర్, భాగస్వామి, ప్రతి సపోర్టర్ కు ఈ రికార్డు చెందుతుందని చెప్పారు. ఈ ప్రదర్శన తమ ఐక్యతకు, దేశభక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి, జోహో కార్పొరేషన్ చీఫ్ ఎవాంజెలిస్ట్ రాజు వేగేశ్న, అతిథి వక్త యు.ఎస్. కాంగ్రెస్ ఉమెన్ అనలీలియా మెజియాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంకేతికత, ప్రజాసేవ, వాణిజ్య రంగాల్లో ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
ఎఫ్‌ఐఏ తక్షణ మాజీ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ మాట్లాడుతూ, బలమైన పునాదులు, బృంద కృషి వల్లే ఈ రికార్డు సాధ్యమైందని, భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తినిస్తుందని చెప్పారు. సంస్థ గతంలోనూ పలు గిన్నిస్ రికార్డుల ప్రయత్నాలు చేసిందని, సవాళ్లు ఎదురైనా సమాజాన్ని ఏకం చేసే తుది ఫలితం ఎంతో సంతృప్తినిచ్చిందని చైర్మన్ అంకుర్ వైద్య గుర్తుచేసుకున్నారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు, రికార్డు ప్రదర్శన వీక్షణతో ఈ కార్యక్రమం ముగిసింది.
1970లో స్థాపించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA), అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో భారతీయ సంతతికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద లాభాపేక్షలేని సంస్థ. ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన జోహో కార్పొరేషన్ చెన్నై కేంద్రంగా పనిచేస్తూ, టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో యు.ఎస్ కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ సంస్థ.