
India Day FIA Event: న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మువ్వన్నెల కాంతులతో జిగేల్ మంది. ఆగస్టు 14న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA NY-NJ-CT-NE) తమ వార్షిక ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లైటింగ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మాన్హాటన్ ల్యాండ్‌మార్క్‌ను కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అద్భుతంగా అలంకరించారు.
ఈ ఏడాది 'హార్మనీ ఇన్ హెరిటేజ్' అనే థీమ్‌తో 44వ వార్షిక 'ఇండియా డే' వేడుకలను నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాల చారిత్రక ఘట్టాలను ఈ వేడుక కలసికట్టుగా జరుపుకొంది. భారత్ తన 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో, అమెరికా కూడా తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.
కళాశ్రీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యంతో ఈ కార్యక్రమం చాలా వైభవంగా ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌కు బీనా మీనన్ కొరియోగ్రఫీ అందించారు. FIA జాయింట్ సెక్రటరీ సృజల్ పటేల్ ఈ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించారు. వచ్చిన అతిథులకు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యాన్ని గుర్తుచేస్తూ సభను ముందుకు నడిపించారు.
ఈ ప్రత్యేక సందర్భంలో FIA ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడారు. "అమెరికా 250 ఏళ్ల వేడుకలు, భారత్ 80 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఒకేసారి జరుపుకోవడం రెట్టింపు సంతోషాన్ని ఇస్తోంది. మన కమ్యూనిటీ గర్వకారణమైన ఎడిసన్ మేయర్ శామ్ జోషి ఈ వెలుగుల పండగను ప్రారంభించడం ఎంతో విశేషం" అని ఆయన అన్నారు. FIA ప్రెసిడెంట్ శ్రీకాంత్ అక్కపల్లి కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడారు.
FIA ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎడిసన్ మేయర్ శామ్ జోషి మాట్లాడారు. ట్రై-స్టేట్ ప్రాంతంలో భారతీయ అమెరికన్ల ప్రభావం చాలా గొప్పదని ఆయన కొనియాడారు. హెల్త్‌కేర్, బిజినెస్, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి రంగాలలో భారతీయ సమాజం అందిస్తున్న సేవలను, కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ వేడుకలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా' (TMKOC) టీవీ షో బృందం. నీలా ఫిల్మ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సీరియల్ నటులు దిలీప్ జోషి, మున్మున్ దత్తా, మందార్ చంద్వాడ్కర్, సోనాలికా జోషి, బల్విందర్ సింగ్, నితేష్ భలూనిలతో పాటు శేష్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. టవర్‌ను త్రివర్ణ కాంతుల్లో ముంచెత్తేందుకు సాంప్రదాయ స్విచ్‌ను లాగే అరుదైన గౌరవం శేష్‌కి దక్కింది.
ఈ అద్భుతమైన దృశ్యాన్ని తిలకించడానికి వందలాది మంది సందర్శకులు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా FIA డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వీక్షకులు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించారు. లైటింగ్ కార్యక్రమం పూర్తయిన తర్వాత సందర్శకులు భవనం గ్రాండ్ స్టెయిర్‌కేస్‌పై గ్రూప్ ఫోటోలు దిగారు.
ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ప్రతినిధుల నుంచి అతిథులు జ్ఞాపికలను స్వీకరించారు. ఆ తర్వాత భవనంలోని అబ్జర్వేషన్ డెక్స్‌పై వేడుకలు కొనసాగాయి. గౌరవ గ్రహీతలను అభినందిస్తూ మేయర్ జోషి తన ప్రసంగాన్ని ముగించారు. భారతీయ సమాజాన్ని ఐకమత్యంగా ఉంచడంలో నిరంతరం కృషి చేస్తున్న FIA సంస్థకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.