దేశంలో రోజుకు 86 అత్యాచారాలు.. ఆ రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు అధికం.. ఎన్‌సీఆర్‌బీ నివేదిక

By Sumanth KanukulaFirst Published Aug 31, 2022, 3:39 PM IST
Highlights

దేశంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. 2021లో దేశంలో 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ (ఎన్‌సీఆర్‌బీ) బ్యూరో ‘క్రైమ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక గణంకాలను వెల్లడించింది.

దేశంలో మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. 2021లో దేశంలో 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ (ఎన్‌సీఆర్‌బీ) బ్యూరో ‘క్రైమ్ ఇన్ ఇండియా 2021’ నివేదిక గణంకాలను వెల్లడించింది. ఈ గణంకాలను పరిశీలిస్తే దేశంలో రోజుకు సగటున 86 అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు  మహిళలపై నేరాలకు సంబంధించిన దేశవ్యాప్తంగా ప్రతి గంటకు సగటున 49 కేసులు నమోదవుతున్నాయి. ఇక, 2020లో అత్యాచార కేసుల సంఖ్య 28,046 కాగా, 2019లో 32,033గా నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఎన్‌సీఆర్‌బీ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందనే సంగతి తెలిసిందే.

రాష్ట్రాల పరంగా చూస్తే.. 2021లో రాజస్థాన్‌లో అత్యధికంగా 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 2,947, మహారాష్ట్రలో 2,496, ఉత్తరప్రదేశ్ 2,845, ఢిల్లీలో 1,250 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అత్యాచారానికి సంబంధించిన నేరాల రేటు (లక్ష జనాభాకు) రాజస్థాన్ (16.4)లో అత్యధికంగా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చండీగఢ్ (13.3), ఢిల్లీ (12.9), హర్యానా (12.3), అరుణాచల్ ప్రదేశ్ (11.1) ఉన్నాయి. అదే సమయంలో దేశంలో సగటు రేటు 4.8 గా ఉంది.

ఇక, 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి మొత్తం 4,28,278 కేసులు నమోదయ్యాయి. నేరాల రేటు (ఒక లక్ష జనాభాకు) 64.5 గా ఉంది. అటువంటి నేరాలలో ఛార్జ్‌షీట్ రేటు 77.1 గా ఉన్నట్టుగా ఎన్‌సీఆర్‌బీ డేగా వెల్లడించింది. ఇక, మహిళలపై నేరాల సంఖ్య 2020లో 3,71,503గా, 2019లో 4,05,326గా ఉన్నాయి.

2021లో మహిళలపై నేరాలకు సంబంధించిన డేటాను రాష్ట్రాల పరంగా  చూస్తే.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 56,083 కేసు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 40,738, మహారాష్ట్ర‌లో 39,526, ​​పశ్చిమ బెంగాల్‌లో 35,884, ఒడిశాలో 31,352 కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. మహిళలపై నేరాల రేటు పరంగా 2021కి సంబంధించి అస్సాం (168.3) అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ (147), ఒడిశా (137), హర్యానా (119.7), తెలంగాణ (111.2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మహిళలపై జరిగిన నేరాలలో.. అత్యాచారం, అత్యాచారం చేసిన తర్వాత హ్య, వరకట్నం, యాసిడ్ దాడులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, కిడ్నాప్, బలవంతపు వివాహం, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ వేధింపులు వంటి నేరాలు ఉన్నాయి.

click me!