
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దేశంలో మొట్టమొదటి వర్చువల్ స్కూల్ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇదో విప్లవాత్మక చర్యగా పేర్కొంటూ ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’గా పేరు పెట్టారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుబంధంగా ఈ స్కూల్ కొనసాగుతుందని తెలిపారు.
దేశంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ వర్చువల్ స్కూల్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇందులో చేరవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళి చదువుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారనీ, వారు ఈ పాఠశాలలో చేరవచ్చని ఆయన అన్నారు.
ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌తో అనుబంధించబడిన వర్చువల్ స్కూల్ లో తొమ్మిదో తరగతిలో చేరడానికి నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని వివరించారు. దేశమంతటా ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.dmvs.ac.inని సందర్శించడం ద్వారా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
వర్చువల్ స్కూల్ లో చేరే విద్యార్థులు ఇంటి వద్ద నుంచే లైవ్ లో పాఠాలు వినవచ్చని చెప్పారు. ‘ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్’ నుంచి మెటీరియల్ కూడా అందుకోవచ్చని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.అంతేగాక, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఇంటర్మీడియట్ విద్యార్థులకు నైపుణ్యం ఆధారిత శిక్షణ అందిస్తామని చెప్పారు.
విద్యార్థులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లోకి లాగిన్ చేయడం ద్వారా ప్రత్యక్ష, రికార్డ్ చేయబడిన తరగతులను, మూల్యాంకనాలను యాక్సెస్ చేయవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తున్న పిల్లల కోసం మేము కొత్త ప్రత్యేక పాఠశాలను కూడా ప్రారంభిస్తున్నామనీ, ఇతర ప్రత్యేక కార్యక్రమాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ప్రారంభించబోతున్నామని తెలిపారు.
విద్యారంగంలో అవినీతికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నందున ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా వర్చువల్ స్కూల్ ప్రకటన చేసిందని పలువురు భావిస్తున్నారు.