
ఏప్రిల్ మొదటివారంలోనే ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఇప్పుడే ఇలా వుంటే వచ్చే కొద్దిరోజుల్లో పరిస్ధితి ఎలా వుంటుందోనని జనం భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ సంచలన ప్రకటన చేసింది. రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది. మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర , ఛత్తీస్‌గఢ్‌లలో ఉరుముులు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ కార్యాలయం తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వాతావరణ శాఖ ప్రకారం.. దేశంలోని వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుంది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హార్యానాలలో హీట్ వేవ్ గణనీయంగా పెరిగే అవకాశం వుందని ఐఎండీ తెలిపింది. వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ ప్రకారం.. 1901లో రికార్డ్ కీపింగ్ ప్రారంభమైనప్పటి నుంచి భారత్ ఈ ఏడాదిలోనే తొలిసారిగా హాటెస్ట్ ఫిబ్రవరిని చూసింది. అయితే అల్పపీడన ద్రోణులు వల్ల మార్చిలో ఉష్ణోగ్రతలు అదుపులో వున్నాయని ఐఎండీ పేర్కొంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా వర్షం, ఉరుములు, వడగళ్ల వానలతో పంటలు దెబ్బతిన్నాయి.
ఇదిలావుండగా.. ఈ ఏడాది వేసవిలో కనీసం పది రాష్ట్రాల్లో వడగాలులు వీచే రోజులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు దేశంలోని తీర ప్రాంతాలు, వాయవ్య ప్రాంతాలు మినహా మిగతా ఏరియాల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇండియా మెటీయోరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) వెల్లడించింది.
దేశంలోని మధ్య, తూర్పు, వాయవ్య ప్రాంతాల్లో వడగాలులూ అధికంగా వీచే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే వేడైన వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ‘2023 వేసవిలో దేశంలోని చాలా ప్రాంతాలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతాయి. దక్షిణ తీర ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, వాయవ్య ప్రాంతాలు ఇందుకు మినహాయింపు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్టాల కంటే కొంత తక్కువగా ఉంటాయి’ అని ఐఎండీ తెలిపింది.