Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైనిక, రాజకీయ, వ్యూహాత్మకంగా మానసిక విజయాలు సాధించింది. తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి పొందడమేనని భారత్ స్పష్టం చేసింది.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌తో భారత్ మూడు కీలక విజయాలను సాధించింది. అవి సైనిక, రాజకీయ, వ్యూహాత్మక మానసిక విజయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ప్రారంభించిన ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన భద్రతా విధానాన్ని స్పష్టంగా మార్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్న అధికారులు, ఇది "కొత్త సాధారణ స్థితి" అని తెలిపారు. ప్రస్తుతం భారత్ ధృఢంగా చెప్పిన విషయం ఒక్కటే.. కాశ్మీర్ విషయంలో చర్చలు జరగాల్సింది కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) తిరిగి అప్పగించడం గురించి మాత్రమే.
మే 7న భారత సైన్యం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ముఖ్యంగా జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కేంద్రం బహావల్‌పూర్‌లో బలమైన అస్త్రాలతో జరిపిన దాడిలో తీవ్ర నష్టాలు వాటిల్లాయి. మురీద్కే, ముజాఫ్ఫరాబాద్ శిబిరాలు నశించాయి. పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ వాయుసేన స్థావరం, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్‌వే పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారత ప్రభుత్వం తొలిసారిగా ఇండస్ జలాల ఒప్పందాన్ని సరిహద్దు ఉగ్రవాదానికి అనుసంధానించింది. ఉగ్రవాదం ఆగేవరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా, పాక్ ఉగ్రవాద సంబంధాలపై తాజా సాక్ష్యాలతో కూడిన నివేదికను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమర్పించనున్నట్లు వర్గాలు తెలిపాయి.
"ఘుస్కే మార్గే" అనే సూత్రంతో భారత సైన్యం లోనికి చొచ్చుకుపోయి తీవ్ర దాడులు జరిపింది. మే 9న పాక్ 26 స్థలాలపై దాడి చేయగా, అదే రాత్రి భారత్ మరింత బలంగా ప్రతీకారం తీర్చుకుంది. ప్రధాన మంత్రి మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడుతూ, పాక్ ఏదైనా చేస్తే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని తెలిపారు.
భారత్ ప్రస్తుతం కాశ్మీర్ విషయంలో స్పష్టమైన ధృక్కోణాన్ని తీసుకుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం.."చర్చించాల్సింది ఒక్కటే.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి అప్పగించడం. మిగిలిన అంశాలపై మాకు ఎలాంటి చర్చా ఆసక్తి లేదు. ఈ విషయంలో ఎవరి జోక్యం అవరసం లేదు" అని స్పష్టం చేసింది.
భారత దాడుల నేపథ్యంలో పాక్ డీజీఎంఓ మే 10న కాల్ చేసి ఉద్రిక్తత తగ్గించాలని కోరినట్లు సమాచారం. ప్రతి సైనిక యత్నంలో పాకిస్తాన్ ఓటమిపాలైందని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు ఇక పోరాడే శక్తి లేదని తెలిసి చర్చలకు వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, "ఆపరేషన్ సింధూర్ ఇప్పుడే ముగియలేదు. ఇది కొత్త సాధారణ స్థితి. ప్రపంచం దీన్ని అంగీకరించాలి. పాకిస్తాన్ దీనిని అంగీకరించక తప్పదు" అని భారత ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి.