ఆకలి సూచీలో దిగజారిన భారత్.. మనకంటే మెరుగ్గా పాక్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలు

By Mahesh RajamoniFirst Published Oct 15, 2022, 3:12 PM IST
Highlights

Global Hunger Index-2022: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2022 రిపోర్టులో భార‌త్ లో ఆకలికేక‌లు పెరుగుతున్నాయ‌నీ, ఇది తీవ్రమైన అంశమ‌ని పేర్కొంది. ఎందుకంటే, పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84),నేపాల్ (81) వంటి పొరుగు దేశాల కంటే భార‌త్ వెనుక‌బ‌డి ఉంది.
 

Global Hunger Index-2022: దేశంలో ఆక‌లికేక‌లు పెరుగుతున్నాయ‌నీ, పోష‌కాహార లోపం సైతం తీవ్రంగా వేధిస్తున్న‌ద‌ని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI) 2022 రిపోర్టు..భార‌త్ లో ఆకలికేక‌లు పెరుగుతున్నాయ‌నీ, ఇది తీవ్రమైన అంశమ‌ని పేర్కొంది. ఎందుకంటే, పాకిస్తాన్ (99), బంగ్లాదేశ్ (84),నేపాల్ (81) వంటి పొరుగు దేశాల కంటే భార‌త్ వెనుక‌బ‌డి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను  గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచీ) సూచిస్తుంది.

వివ‌రాల్లోకెళ్తే.. శనివారం విడుదల చేసిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ)-2022లో గత ఏడాది 101వ స్థానంలో నిలిచిన భారత్.. ఈ సారి 121 దేశాల జాబితాలో 107వ స్థానానికి పడిపోయింది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్ అండ్ జ‌ర్మ‌న్ ఆర్గనైజేషన్ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా రూపొందించిన ఈ హంగ‌ర్ ఇండెక్స్ నివేదిక ప్ర‌కారం.. భారతదేశంలో ఆకలి స్థాయిని తీవ్రమైంద‌ని పేర్కొంది. దాని పొరుగు దేశాల కంటే దిగువ‌కు భార‌త్ ప‌డిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్ 99వ స్థానంలో ఉండ‌గా, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81 స్థానాల్లో భార‌త్ కంటే మెరుగైన ర్యాంకులో ఉన్నాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్-2022 అధికారిక వెబ్‌సైట్‌లో భాగస్వామ్యం చేసిన ర్యాంకింగ్ ప్రకారం.. బెలారస్, హంగరీ, చైనా, టర్కీ, కువైట్‌తో సహా పదిహేడు దేశాలు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.


గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్-2021 జాబితా ప్ర‌కారం.. మొత్తం 116 దేశాలలో భారతదేశం 101వ స్థానంలో నిలిచింది.  ఈ ఏడాది జాబితాలో 121 దేశాలు ఉండటంతో ఆ స్థానం మరింత దిగజారి 107వ ర్యాంక్‌కు చేరుకుంది. భారతదేశం GHI స్కోర్ కూడా 2000లో 38.8 నుండి 2014 -2022 మధ్య 28.2- 29.1 శ్రేణికి ప‌డిపోయింది. గత ఏడాది మాదిరిగానే, ఈ జాబితాలో భారత్ కంటే వెనుకబడిన ఏకైక ఆసియా దేశంగా ఆఫ్ఘనిస్తాన్ (109) నిలిచింది.

మోదీ ప్రభుత్వంపై ప్ర‌తిప‌క్షాలు ఫైర్ 

ఆక‌లి సూచీలో భార‌త్ ర్యాంకు గ‌తంలో పోలిస్తే మ‌రింత దిగజారింది. ఇదే విష‌యాన్నిప్ర‌స్తావిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీలు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ నివేదిక‌ను ఉటంకిస్తూ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పీ. చిదంబరం కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోడీ పై వ‌రుస ట్వీట్లలో విమ‌ర్శ‌లు గుప్పించారు. పోషకాహార లోపం, ఆకలి, పిల్లల్లో పెరుగుదల క్షీణ‌త వంటి వాస్త‌వ సమస్యలను గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఎప్పుడు పరిష్కరిస్తారు? భారతదేశంలో 22.4 కోట్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చిదంబ‌రం ట్వీట్ చేశారు. 

అలాగే, "మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 8 సంవత్సరాలలో 2014 నుండి ఆక‌లి సూచీలో మ‌న స్కోర్ మరింత దిగజారింది. మొత్తం భారతీయులలో 16.3 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. అంటే వారికి తగినంత ఆహారం లేదు. 19.3 శాతం మంది పిల్లలు తీవ్ర ప్ర‌భావంకు గుర‌య్యారు. 35.5 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారు. హిందుత్వ , హిందీని విధించడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ఆకలికి విరుగుడు కాదు" అని అంటూ వ‌రుస ట్వీట్లలో బీజేపీ స‌ర్కారుపై విమర్శ‌ల దాడిని కొన‌సాగించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

click me!