Spy Satellite Project: దూకుడు పెంచిన భారత్.. రూ. 22,500 కోట్లతో స్పై శాటిలైట్ ప్రాజెక్టు

Published : May 13, 2025, 11:34 PM IST
Spy Satellite Project: దూకుడు పెంచిన భారత్..  రూ. 22,500 కోట్లతో స్పై శాటిలైట్ ప్రాజెక్టు

సారాంశం

India Spy Satellite Project: భారత ప్రభుత్వం 22,500 కోట్ల రుపాయలకు పైగా వ్యయంతో గూఢచార ఉపగ్రహాల ప్రాజెక్టు (స్పై శాటిలైట్ ప్రాజెక్టు) ను ప్రారంభించింది. పాకిస్తాన్ తో ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య‌ ప్రాజెక్టు పూర్తి గడువును నాలుగు సంవత్సరాల నుంచి 1 సంవత్సరానికి తగ్గించి 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

India Spy Satellite Project: పాకిస్తాన్ తో ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య భార‌త్ త‌న ర‌క్ష‌ణ వ్య‌వస్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మంలోనే  భారత ప్రభుత్వం 22,500 కోట్ల రుపాయల వ్యయంతో గూఢచార ఉపగ్రహాల ప్రాజెక్టును ((స్పై శాటిలైట్ ప్రాజెక్టు) ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ సరిహద్దులపై గూఢచార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఆధునిక ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రాజెక్టు ప్రారంభానికి ముందు, గడువును నాలుగు సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ గడువును తగ్గించి 12-18 నెలలుగా నిర్ణయించింది. 2026 నాటికి ఈ ఉపగ్రహాలు కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, 52 ఉపగ్రహాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వీటిలో 31 ఉపగ్రహాలను ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేస్తాయి, మిగిలిన 21 ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్టుకు అనంత్ టెక్నాలజీస్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ వంటి ప్రైవేట్ కంపెనీలు భాగస్వామ్యంగా ఉన్నాయి.

ఈ ఉపగ్రహాల ప్రధాన ఉద్దేశ్యం దేశ సరిహద్దులపై గూఢచార కార్యకలాపాలను నిర్వహించడం. అలాగే, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కూడా వీటి ఉపయోగం ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఎలాన్ మ‌స్క్ స్పేస్ X సంస్థ సహకారం అందించనుంది. ఉపగ్రహాలను అభివృద్ధి చేసి, లాంచ్ చేయడానికి భారతదేశంలోని సతీష్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రం (Satish Dhawan Space Centre) ను ఉపయోగిస్తారు. లాంచ్ కోసం ISRO LVM3 రాకెట్ లేదా స్పేస్X రాకెట్ ను ఉపయోగించవచ్చు.

ఏఐ సామ‌ర్థ్యంతో కొత్త ఉప‌గ్ర‌హాలు

స్పై శాటిలైట్ ప్రాజెక్టుతో భారతదేశం మిలిటరీ, నిఘా, భద్రతా రంగాల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంలో మరో ముందడుగు వేయ‌నుంది. స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్ (SBS-III) మిషన్ లో భాగంగా అభివృద్ధి చేస్తున్న కొత్త ఉపగ్రహాలు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వ్యవస్థలతో కూడి ఉంటాయని తాజా నివేదికలు పేర్కొన్నాయి.

ఇస్రో (ISRO) కు చెందిన సీనియర్ అధికారి గత డిసెంబర్‌లో మాట్లాడుతూ..  “కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహాల మధ్య పరస్పర కమ్యూనికేషన్ ఉంటుంది. ఉదాహరణకు, భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని జియో స్థాయిలో ఉన్న ఉపగ్రహం ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాన్ని గుర్తిస్తే, అది లోయర్ ఆర్బిట్‌లోని మరొక ఉపగ్రహాన్ని అడిగి ఆ ప్రాంతాన్ని సమగ్రమైన దృక్కోణంలో పరిశీలించమని కోరుతుంది. తద్వారా మరింత ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించవచ్చు” అని వివరించారు.

ఈ అభివృద్ధితో ఉపగ్రహాల సామర్థ్యం మెరుగవుతుంది, డేటా విశ్లేషణలో ఏఐ ఆధారిత పద్ధతులు, అవసరమైన సమాచారం మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే విధంగా వ్యవస్థలు రూపుదిద్దుకుంటాయని అధికారులు చెప్పారు. కేవలం ఉపగ్రహాలు మాత్రమే కాకుండా, ఇటీవల భారత కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన 31 అమెరికన్ జనరల్ అటామిక్స్ ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు కూడా SBS-III మిషన్ నిఘా సామర్థ్యాన్ని మరింతగా పెంచుతుంది.

ఇంతకు ముందు అభివృద్ధి చేసిన GSAT-7B (ఆర్మీ), GSAT-7 (నేవీ), GSAT-7A (ఎయిర్ ఫోర్స్) లాంటి ప్రత్యేక మిలిటరీ ఉపగ్రహాల మాదిరిగానే, ఈ కొత్త ఉపగ్రహాలు భారత త్రివిధ దళాలకు అవసరమైన ప్రత్యేక ఆపరేషన్లకు మద్దతుగా పనిచేస్తాయి. SBS వ్యవస్థ ద్వారా వాతావరణం, సమయ పరిమితులు లేకుండా 24 గంటలూ నిఘా చేయడం సాధ్యమవుతుంది. ఇది సరిహద్దుల భద్రతను పెంచడమే కాకుండా, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా కీలక సమాచారాన్ని అందించగలదు.

 

PREV
Read more Articles on
click me!