చైనాకు మ‌రోసారి షాకిచ్చిన భారత్‌.. 232 చైనా యాప్‌లపై నిషేధం

By Mahesh RajamoniFirst Published Feb 5, 2023, 2:30 PM IST
Highlights

New Delhi: చైనాకు సంబంధించిన 232 మొబైల్‌ యాప్‌లపై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 లోన్‌ యాప్‌లు ఉన్నాయ‌ని కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 

Centre to ban 232 apps with Chinese links: భార‌త్ మ‌రోసారి చైనాకు షాకిచ్చింది. ఆ దేశానికి చెందిన ప‌లు యాప్ ల‌పై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ సూచ‌న‌ల మేర‌కు చైనాకు సంబంధించిన 232 మొబైల్‌ యాప్‌లపై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్‌ యాప్‌లు, 94 లోన్‌ యాప్‌లు ఉన్నాయ‌ని ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యవసర ప్రాతిపదికన చైనా లింకులున్న ఈ యాప్ ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు వివ‌రించింది. 

ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై)కు ఈ వారంలో ఉత్తర్వులు అందినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఈ యాప్ లను బ్లాక్ చేసే ప్రక్రియను ఎంఈఐటీవై ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు ధృవీకరించాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం భారత సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగించే అంశాలు ఈ యాప్ ల‌లో ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.

భారతీయులను నియమించుకుని వారిని డైరెక్టర్లుగా చేసిన చైనా జాతీయుల ఆలోచనే ఈ యాప్స్ అని తెలుస్తోంది. ఏఎన్ఐ నుంచి అందిన సమాచారం ప్రకారం నిరాశా నిస్పృహలకు గురైన వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి ఏడాదికి 3,000 శాతం వరకు వడ్డీని పెంచుతున్నారు. అప్పులు చేసిన వారు వడ్డీలు తిరిగి చెల్లించలేక, మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించలేకపోవడంతో, ఈ యాప్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు అప్పుల్లో ఉన్నవారిని వేధించడం ప్రారంభించారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను బయటపెడతామని బెదిరిస్తూ అసభ్యకర సందేశాలు పంపి, వారి కాంటాక్ట్స్ కు మెసేజ్ లు పంపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి రుణాలు తీసుకున్నవారు, బెట్టింగ్ యాప్ లకు డబ్బులు పోగొట్టుకున్న వారు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని పలు రాష్ట్రాలు, కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా ఎంహెచ్ఏ ఆరు నెలల క్రితం 28 చైనీస్ లోన్ లెండింగ్ యాప్ ల‌ను విశ్లేషించడం ప్రారంభించింది. అయితే ఈ-స్టోర్లలో 94 యాప్ లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్ పార్టీ లింక్ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించారు.

భారత భద్రతకు ముప్పుగా పరిణమించిన పలు చైనా యాప్ ల‌ను కేంద్రం గతంలోనూ నిషేధించిన విషయం తెలిసిందే.  వాటిలో టిక్ టాక్, షేరిట్, వీచాట్, హెలో, లైక్, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్, ఎంఐ కమ్యూనిటీ వంటి పాపులర్ అప్లికేషన్లతో సహా 200కు పైగా చైనీస్ యాప్స్ ను ప్రభుత్వం జూన్ 2020 నుండి నిషేధించింది.

 

Centre to ban 138 betting apps, 94 loan lending apps with Chinese links

Read Story | https://t.co/VBvMA0UCRV pic.twitter.com/UKYSmlDaGj

— ANI Digital (@ani_digital)
click me!